గత నెలలో జరిగిన పరిషత్ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఏప్రిల్ 1న వెల్లడయిన పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ చెల్లదని న్యాయస్థానం తేల్చి చెప్పింది. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఎన్నికల పోలింగుకి నాలుగు వారాల ముందు నోటిఫికేషన్ ఇవ్వాలనీ, ఆ నిబంధనను పాటించనందున పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ చెల్లదనీ న్యాయస్థనం స్పష్టం చేసింది. 202లోనే పరిషత్ ఎన్నికలు జరగాల్సి వుండగా, కరోనా నేపథ్యంలో అప్పటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్.. ‘ప్రక్రియ’ను వాయిదా వేశారు. అప్పట్లో ఆ వాయిదా వ్యవహారం రాజకీయంగా పెను దుమారం రేపింది. అనంతరం చాలా పరిణామాలు చోటు చేసుకన్నాయి.
నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపు, ఆయన స్థానంలో కనకరాజ్ కొత్త ఎస్ఈసీగా నియామకం.. కోర్టు తీర్పుల నేపథ్యంలో కనకరాజ్ తొలగింపు, తిరిగి నిమ్మగడ్డ నియామకం.. ఇలా పెద్ద కథే నడిచింది. అనేక వివాదాల నడుమ, నిమ్మగడ్డ హయాంలోనే పంచాయితీ, మునిసిపల్ – కార్పొరేషన్ ఎన్నికలూ జరిగాయి. అయితే, సెకెండ్ వేవ్ నేపథ్యంలో.. అలాగే తన టెర్మ్ ముగుస్తున్న నేపథ్యంలో నాలుగు వారాల ముందు నోటిఫికేషన్ ఇవ్వలేని పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని పరిషత్ ఎన్నికలకు ఆయన ససేమిరా అన్నారు. ఇలా నిమ్మగడ్డ పదవీ విరమణ చేసి అలా నీలం సాహ్నీ కొత్త ఎన్నికల కమిషనర్ అయ్యారో లేదో.. ఆ వెంటనే నోటిఫికేషన్ వచ్చేసింది, కోర్టులో ఆ నోటిఫికేషన్ రద్దు చేయాలంటూ విపక్షాలు సవాల్ చేసినా.. చివరికి కోర్టు స్టేతో ఎన్నికల పోలింగ్ జరిగింది. ఇప్పుడు.. ఆ నోటిఫికేషన్ చెల్లదని న్యాయస్థానం తేల్చడం, నోటిఫికేషన్ రద్దవడంతో మొత్తంగా ఎన్నికల పక్రియ బూడిదలో పోసిన పన్నీరుగా మారిందని చెప్పొచ్చు.