తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు, అమరావతి భూ కుంభకోణంలో ‘క్లీన్ చిట్’ పొందబోతున్నారట. తెలుగుదేశం పార్టీ నమ్మకమిది. అయితే, ఆయన్ని ఎలాగైనా జైలుకు పంపించాలని అధికార వైసీపీ ప్రయత్నిస్తోంది. ఈ మేరకు కేసులు నమోదయ్యాయి.. కానీ, హైకోర్టులో చంద్రబాబుకి ఊరట, ప్రభుత్వానికి షాక్ తగిలాయి. కేవలం 4 వారాల స్టే మాత్రమే చంద్రబాబు ఆయన బృందానికి లభించినప్పటికీ, అసలు కేసుకి విచారణ అర్హత వుందా.? లేదా.? అనేది నాలుగు వారాల తర్వాత తేలే అవకాశం వుండడంతో వైసీపీ వర్గాల్లోనూ గుబులు బయల్దేరింది.
విచారణ అర్హత లేదని న్యాయస్థానం తేల్చితే పరిస్థితి ఏంటి.? అన్నదే ఇప్పుడు కీలకం. నిన్న కోర్టు చేసిన వ్యాఖ్యలు చూస్తోంటే, ఈ కేసు అసలు నిలబడేలా లేదన్న భావన న్యాయ నిపుణుల నుంచి వ్యక్తమవుతోంది. ఈ విషయాన్ని ముందే టీడీపీ బల్లగుద్ది మరీ చెప్పింది. సీఆర్డీయే చట్టం అత్యంత పకడ్బందీగా రూపొందింది. పైగా, రాజధాని అమరావతి కోసం రైతుల నుంచి తీసుకున్న భూముల్ని రాష్ట్ర ప్రభుత్వం ఎవరికీ విక్రయించలేదు. అంటే, దానర్థం.. భూములపై ఇంకా రైతులకు హక్కులున్నాయనే కదా.! సో, కుంభకోణం.. అనే మాటకు అర్థమే వుండకపోవచ్చు.
జీవో 41 విషయంలోనూ కోర్టు చేసిన వ్యాఖ్యలు, కుంభకోణం ఆరోపణలకు వ్యతిరేకంగా వుండడం గమనార్హం. ఎలా చూసినా, ఈ విషయంలో అధికార వైసీపీ బొక్క బోర్లా పడినట్లే కనిపిస్తోంది. మాజీ ముఖ్యమంత్రి మీద కేసులు పెట్టి, విచారణకు హాజరు కాకపోతే అరెస్టు చేయాల్సి వుంటుందనే స్థాయిలో నోటీసులు ఇచ్చినప్పుడు, ఆధారాలు పకడ్బందీగా వుండాలి. అవేవీ లేవని నిన్నటి కోర్టు విచారణలోనే తేలిపోయింది. అంటే, ఎంత తేలిగ్గా.. ఎంత సిల్లీగా ఈ విషయాన్ని జగన్ ప్రభుత్వం తీసుకుందో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి చర్యలతో చంద్రబాబు పొలిటికల్ ఇమేజ్ పెరుగుతుంది.. అదే సమయంలో జగన్ పొలిటికల్ ఇమేజ్ దిగజారిపోతుంది. ఇలాంటి సలహాలు ఎవరు ఇస్తున్నారోగానీ.. వైసీపీని మాత్రం తప్పుదోవ పట్టిస్తున్నారనే అభిప్రాయం వైఎస్ జగన్ అభిమానుల్లోనూ కనిపిస్తోంది.