ఓ వైపు జనాలంతా కరోనా మహమ్మారితో టెన్షన్ పడుతుంటే కొత్త కొత్త వైరస్ లు పుట్టుకొస్తున్నాయి. కరోనానే తట్టుకోలేక ఓవైపు టెన్షన్ పడుతుంటే ఈ కొత్త వైరస్ ల గోల ఏంటో అర్థం కావడం లేదు. ఇప్పటికే ప్రపంచం మొత్తం వ్యాపించిన కరోనాతో పాటు మరో వైరస్ ప్రపంచాన్ని అటాక్ చేయబోతున్నదంటూ ఇటీవలే ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించిన సంగతి తెలిసిందే.
తాజాగా ఏపీలోని వైజాగ్ లో మరో కొత్త వైరస్ హడలెత్తిస్తోంది. విశాఖపట్టణం అంటేనే ఎక్కువగా ఏజెన్సీ ఏరియా ఉంటుంది. అక్కడే ఈ కొత్త వైరస్ తన ప్రతాపాన్ని చూపిస్తోందట. ఓవైపు కరోనాతో పోరాడుతూ.. మరోవైపు ఈ కొత్త వైరస్ ను ఎలా ఎదుర్కోవాలో తెలియక ఏజెన్సీ ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు.
ఇక.. విశాఖ ఏజెన్సీలో ప్రబలుతున్న ఆ వైరస్ పేరు స్క్రబ్ టైఫస్. ఓ పురుగు ద్వారా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది. ఎక్కువగా మురుగు నీరు ఎక్కువగా నిల్వ ఉన్న చోట, గడ్డి ఎక్కువగా ఉన్న చోట ఈ పురుగు ఉంటుంది. ఆ పురుగు మనిషి మీదికి ఎక్కి కుడుతుంది. అది కుట్టిన చోట ముందుగా దద్దుర్లు వస్తాయి. ఆ తర్వాత మెల్లగా జ్వరం వస్తుంది.
రోజురోజుకూ జ్వరం ఎక్కువవుతూనే ఉంటుంది. కానీ తగ్గదు. మనిషికి స్క్రబ్ టైఫస్ అనే వైరస్ సోకింది అని తెలుసుకునేలోపే ఆ వైరస్.. కిడ్నీలు, గుండె, కాలేయంపై ప్రభావం చూపిస్తుంది. కాకపోతే ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందదు. ఆ పురుగు కుడితేనే ఈ వైరస్ వస్తుంది.
విశాఖ ఏజెన్సీ పరిధిలో ఇప్పటికే ఈ వైరస్ ధాటికి ముగ్గురు బలి అయ్యారు. వీళ్లకు జ్వరం రావడంతో ముందుగా కరోనా వచ్చిందేమో అని అనుకున్నారు. కానీ.. కరోనా పరీక్షలు చేయగా నెగెటివ్ వచ్చింది. జ్వరం తీవ్రత పెరుగుతుండటంతో మలేరియా, డెంగ్యూ పరీక్షలు కూడా చేశారు. అవి కూడా నెగెటివ్ వచ్చాయి. దీంతో వైద్య నిపుణులు కొంచెం లోతుగా విశ్లేషించగా.. అది స్క్రబ్ టైఫస్ అని తేలింది.
అయితే.. ఈ వైరస్ కు వ్యాక్సిన్ ఉంది. ఈ వైరస్ సోకిందని ముందుగానే తెలిస్తే.. యాంటీ బయోటిక్ ఇంజక్షన్ ను వాడుతారు. దాని వల్ల వైరస్ ప్రభావం తగ్గుతుంది. కానీ.. ఆ వైరస్ సోకిందని తెలుసుకోలేకపోతే మాత్రం శరీరంలో ఉన్న అవయవాల మీద అది దాడి చేస్తుంది. ఈ వైరస్ బారిన పడకుండా ఉండాలంటే… ఇంటి దగ్గర మురుగు నీరు లేకుండా చూసుకోవడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం లాంటివి చేయాలి.