ఏపీ విద్యార్థులంతా ఎదురు చూస్తున్న స్కూళ్ల పున:ప్రారంభంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నవంబర్ 2 నుంచి ఏపీలోని అన్ని పాఠశాలలు తెరుచుకోనున్నాయి. నవంబర్ 2 నుంచి పాఠశాలలు తెరుచుకోబోతున్నట్టు సీఎం జగన్ వెల్లడించారు.
అయితే.. మునుపటిలా కాకుండా.. అన్ని తరగతుల క్లాసులను రోజు తప్పించి రోజు విధానంలో నిర్వహించనున్నారు. అంటే.. 1, 3, 5, 7 తరగతులకు ఒక రోజు.. తర్వాతి రోజున 2, 4, 6, 8 తరగతులకు క్లాసులు నిర్వహించనున్నారు.
జిల్లాల కలెక్టర్లు, ఎస్సీలతో స్పందన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్.. ఈ సందర్భంగా స్కూళ్ల రీఓపెన్ గురించి చర్చించారు. పాఠశాలల ప్రారంభం, నిర్వహణ తదితర అంశాలపై వాళ్లతో చర్చించిన అనంతరం.. స్కూళ్ల పున:ప్రారంభ తేదీని వెల్లడించారు.
స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య 750 కంటే తక్కువ ఉంటే రెండు రోజులకు ఒకసారి నిర్వహించాలని.. ఒకవేళ 750కి ఎక్కువ ఉంటే మూడు రోజులకు ఒకసారి క్లాసులు నిర్వహించాలని అధికారులకు సీఎం జగన్ సూచించారు.
ప్రభుత్వం పాఠశాలల్లో మధ్యాహ్నం భోజంన తర్వాత క్లాసులు నిర్వహించకుండా.. విద్యార్థులను ఇంటికి పంపించేయాలని సీఎం చెప్పారు. నవంబర్ నెల వరకు మాత్రం ఈ రూల్స్ వర్తిస్తాయని.. డిసెంబర్ లో అప్పటి పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుందామని సీఎం చెప్పారు.
ఒకవేళ తల్లిదండ్రులను తమ పిల్లలను పాఠశాలకు పంపించడం ఇష్టం లేకపోతే.. వాళ్లకు ఆయా స్కూళ్ల యాజమాన్యాలు ఆన్ లైన్ లో క్లాసులు నిర్వహించాలని సీఎం జగన్ స్పష్టం చేశారు.