త్వరలో స్కూళ్ళు తెరచుకోనున్నాయట..గత ఏడాది బోనాలు కరోనా కారణంగా సరిగ్గా నిర్వహించలేకపోయారు గనుక.. ఈసారి ఘనంగా నిర్వహించాలట.. ఇంకోపక్క దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల కోసం బీజేపీ సమాయత్తమవుతోందట. పలు రాష్ట్రాల్లో ఉప ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీలు సర్వసన్నద్ధమవుతన్నాయట.
పర్యాటక రంగానికి కొత్త ఊపు తెచ్చేందుకు ప్రమోషనల్ ఈవెంట్స్ నిర్వహించాలట.. దేశవ్యాప్తంగా ఎక్కడ.. ఏ రాష్ట్రంలో చూసినా ఇదే హడావిడి.
తెలుగు రాష్ట్రాల్లో ఇంకొంచెం ఎక్కువ హడావిడి కనిపిస్తోందంతే. అసలెవరికన్నా బాధ్యత వుందా.? లేనే లేదు. వందలాది మంది వేలాది మంది కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు మొదటి వేవ్, రెండో వేవ్ సందర్భంగా.
మూడో వేవ్ వచ్చేస్తోంది.. అతి ప్రమాదకరమైన డెల్టా ప్లస్ వేరియంట్ చాపకింద నీరులా పాకేస్తోంది.. అంటూ ఓ వైపు హెచ్చరికలు వినిపిస్తున్నా, రాజకీయ పార్టీల్లో బాధ్యత కనిపించడంలేదు.
కరోనా మూడో వేవ్ ప్రధానంగా చిన్నారులపై ప్రభావం చూపే అవకాశం వుందన్నది వైద్య నిపుణుల అంచనా. అబ్బే.. అలాంటిదేమీ లేదని ప్రభుత్వాలు చెప్పడానికి వీల్లేని పరిస్థితి. మూడో వేవ్ రాకూడదనే కోరుకుందాం.
కానీ, ఖచ్చితంగా వచ్చేలా చేస్తున్నాయి రాజకీయ పార్టీలు. ప్రభుత్వంలో వున్నవారు అస్సలేమాత్రం బాధ్యతాయుతంగా వ్యవహరించకపోవడంతోనే సెకెండ్ వేవ్ వచ్చింది.
మళ్ళీ అదే నిర్లక్ష్యం ఇప్పుడూ కనిపించబోతోంది. వ్యాక్సినేషన్ ప్రక్రియ బాగానే కొనసాగుతున్నా, ఆ వ్యాక్సినేషన్ కరోనా వ్యాప్తిని అడ్డుకోలేదని పలు అధ్యయనాలే చెబుతున్నాయ్. మరి, కరోనా వైరస్ మీద పోరాటం ఎలా.? మిలియన్ డాలర్ క్వశ్చన్ ఇదిప్పుడు. మనం వెల్కమ్ చెబుతోంటే, కరోనా వైరస్ రాకుండా వుంటుందా.?