ఆంధ్రప్రదేశ్‌లో స్కాములు సరే.. దోషులెవరు అధ్యక్షా.?

కేసులు నమోదైనంత మాత్రాన.. నిందితులు, నేరస్తులైపోరు. నిందితులు, నేరస్తులుగా నిరూపితమవ్వాలంటే అదో పెద్ద కథ. బెయిల్ తెచ్చుకోవడం, కేసు విచారణ ముందుకు కదలకుండా అడ్డగోలు సాకులు చెప్పడం.. చాలా కాలంగా చాలా కేసుల్లో అందరికీ కనిపిస్తున్నదిదే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల విషయానికొస్తే, గడచిన రెండున్నరేళ్ళలో టీడీపీకి చెందిన చాలామంది మీద చాలా కేసులు నమోదయ్యాయి. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి మీద కూడా అమరావతి ల్యాండ్ స్కామ్ వ్యవహారానికి సంబంధించి సీఐడీ కేసులు నమోదు చేసింది. రోజులు, నెలలు, ఏళ్ళు గడిచిపోతున్నాయ్.. ఆయా కేసుల్లో దోషులెవరో మాత్రం తేలడంలేదు. రాజకీయ యుద్ధానికి మాత్రమే ఈ కేసులు ఉపయోగపడుతున్నాయన్న విమర్శలున్నాయి. చంద్రబాబు హయాంలో జరిగిన అక్రమాలపై వైఎస్ జగన్ సర్కారు ఫోకస్ పెట్టిన మాట వాస్తవం.

కానీ, ఆయా కేసుల్లో ప్రభుత్వ చిత్తశుద్ధి ఎంత.? అన్న ప్రశ్న ఉత్పన్నమయ్యే పరిస్థితి రాకూడదు. ఇంకో రెండేళ్ళలో ఆయా కేసుల్లో దోషులెవరో తేలతారా.? అంటే, అది అంత తేలికైన వ్యవహారం కాదు. మరి, వచ్చే ఎన్నికల నాటికి వైఎస్ జగన్ సర్కార్, ప్రజలకు ఏం సమాధానం చెప్పగలుగుతుంది.? ఈఎస్ఐ మెడికల్ స్కామ్, అమరావతి ల్యాండ్ స్కామ్, ఫైబర్ నెట్ స్కామ్.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే వున్నాయి. చంద్రబాబు హయాంలో కూడా, ‘అక్రమార్కులు దోచేసిన ప్రజా ధనాన్ని వెనక్కి రప్పిస్తాం..’ అంటూ శపథాలు చేసేశారు, ఏమీ చెయ్యలేకపోయారు. ఇప్పుడు వైఎస్ జగన్ పరిస్థితి కూడా అంతేనా.? రివర్స్ టెండరింగ్ పేరుతో డబ్బులు మిగిల్చేశామని చెప్పుకున్నంత ఈజీ కాదు, ఆయా కేసుల్లో నిందితుల్ని దోషులుగా నిరూపించడం. స్కాములున్నాయ్.. కానీ, దోషులెవరన్నదే తేలడంలేదు. దీనిక్కారణం ముమ్మాటికీ రాజకీయమే.