Say No To BJP : బీజేపీతో పొత్తు వద్దంటున్న జనసైనికులు, పవన్ ఏం చెబుతారో మరి.!

Say No To BJP : బీజేపీతో పొత్తు వద్దే వద్దంటున్నారు.. తెలుగుదేశం పార్టీ వలలో అస్సలు పడొద్దంటున్నారు.. వైసీపీ చేస్తున్న దుష్ప్రచారానికి అడ్డకట్ట వేయలేని పరిస్థితి వచ్చిందంటూ నెత్తీనోరూ బాదుకుంటున్నారు. ఇదీ జనసైనికుల పరిస్థితి. ఇది వారి ఆవేదన. ఇంతకీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మనసులో ఏముంది.?

2014 ఎన్నికల్లో బీజేపీకి, టీడీపీకి మద్దతిచ్చిన జనసేనాని, ఆ తర్వాత ఆ రెండు పార్టీలకూ దూరం జరిగారు. 2019 ఎన్నికల్లో వామపక్షాలతో, బీఎస్పీతో కలిశారు. ఆ తర్వాత వాళ్ళతోనూ విడిపోయి, తిరిగి బీజేపీతో జతకట్టారు. మరి, 2024 ఎన్నికల నాటికి పరిస్థితి ఏమవుతుంది.?

నిజానికి, జనసేన మరీ తీసికట్టుగా ఏమీ లేదు. ఆ పార్టీకి నాలుగు శాతమో, ఐదు శాతమో, ఎనిమిది శాతమో ఓటు బ్యాంకు అయితే వుంది. దాన్ని కాపాడుకోవడం కాదు, పెంచుకోవడం ముఖ్యమిక్కడ. కరడుగట్టిన అభిమానులున్నారు జనసేనానికి. ఏ రాజకీయ పార్టీకీ లేని అభిమానమిది. కానీ, దాన్ని ఆయన రాజకీయంగా క్యాష్ చేసుకోలేకపోతున్నారు.

బీజేపీతో జనసేన కలవడం కొందరు జనసైనికులకు నచ్చడంలేదు. టీడీపీ – జనసేన మధ్య ఏదో వుందన్న ప్రచారం కొందరు జనసైనికుల్ని ఇబ్బంది పెడుతుంది. అభిమానులూ, జనసైనికులు వేర్వేరు కాదు. జనసేన తీసుకునే కొన్ని నిర్ణయాలు ఈ జనసైనికుల్ని అయోమయంలో పడేస్తున్నాయి.

మరి, ఇంత గందరగోళంలో కొట్టుమిట్టాడుతున్న జనసైనికులకి జనసేనాని పవన్ కళ్యాణ్ రేపు భరోసా ఇస్తారా.? వారికి సరైన దిశా నిర్దేశం చేయగలరా.? గందరగోళానికి తెరదించుతారా.? వేచి చూడాల్సిందే. గందరగోళానికి తెరదించడమంటే, బీజేపీతో పొత్తుని తెంచుకోవడమేనండోయ్.! కానీ, అది సాధ్యపడే విషయమేనా.? అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న.