రాజకీయాల్లో నిన్నటి మాట ఈ రోజు పనిచేయకపోవచ్చు. రోజులు మారుతున్నాయ్.. మాటలు కూడా మారాల్సిందే. లేకపోతే, ప్రస్తుత రాజకీయాల్లో మనుగడ కష్టం.. చాలా చాలా కష్టం. శాసన మండలి విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. మడమ తిప్పాల్సిందే. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. శాసన మండలిని ఖర్చు దండగ వ్యవహారంగా అసెంబ్లీలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నినదించారు. శాసన మండలిని రద్దు చేయాలని తీర్మానం కూడా చేసేసింది వైసీపీ. అదిప్పుడు కేంద్రం పరిధిలోకి వెళ్ళింది.
కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటుందనేది ప్రస్తుతానికి సస్పెన్స్. అయితే, ఈలోగా శాసన మండలిలో ఖాళీ అవుతున్న స్థానాల్ని తమ పార్టీకి చెందిన నేతలతో వైసీపీ భర్తీ చేయడాన్ని తప్పు పట్టలేం. ఇప్పటికే శాసన మండలిలో పూర్తి బలం వైసీపీకి లభించింది. టీడీపీ క్రమంగా బలాన్ని కోల్పోతోంది. పదవుల్లేకపోతే ఏ పార్టీ అయినా బలహీనపోతుందన్నది నిర్వివాదాంశం. ఇంకో మూడేళ్ళు టీడీపీ మనుగడ సాధించడం చాలా చాలా కష్టం.. ఇప్పుడున్న పరిస్థితుల్ని బట్టి. అది ఖచ్చితంగా అధికార పార్టీకి అడ్వాంటేజ్ అవుతుంది. అందుకే, ‘శాసన మండలిని రద్దు చేస్తూ తీర్మానం చేసి, కేంద్రానికి పంపాం.
అక్కడితో మా పనైపోయింది.. శాసన మండలిని రద్దు చేయాలని కోరబోం..’ అని వైసీపీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. అయితే, ఇక్కడ నైతికత.. చిత్తశుద్ధి.. వంటి అంశాల ప్రస్తావన రావడం సహజమే. చంద్రబాబులా ప్రతి విషయంలోనూ మాట తప్పితే ఎలా.? మడమ తిప్పితే ఎలా.? అన్నది జనం నుంచి వస్తోన్న ప్రశ్న. ప్రత్యేక హోదా విషయంలోనూ, ఇతర విషయాల్లోనూ మాట తప్పడం, మడమ తిప్పడం తప్ప ఇంకో దారి లేకుండా పోయింది.. ప్రస్తుత పరిస్థిుతుల నేపథ్యంలో. కాబట్టి, శాసన మండలి విషయంలోనూ అంతే.. అని అనుకోవాలేమో.