వైఎస్ జగన్ సంకల్పం నేరవేరుతున్నట్టేనా.?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి చేపట్టాలనే సంక్పంతో మాత్రమే ప్రజా సంకల్ప యాత్ర చేశారనుకుంటే అది పొరపాటే. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన తండ్రి అడుగు జాడల్లో.. రాజన్న రాజ్యం కోసం.. ప్రజలకు మెరుగైన పాలన అందించడం కోసం ప్రజా సంకల్ప యాత్రను ఎంచుకున్నారు.

దేశ రాజకీయాల్లో ఎవరూ చేయని సాహసం వైఎస్సార్ కుటుంబం చేస్తూ వస్తోంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ షర్మిల, వైఎస్ జగన్.. సుదీర్ఘ పాదయాత్రలకు కేరాఫ్ అడ్రస్ అయ్యింది వైఎస్సార్ కుటుంబం. ఇక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజన్న రాజ్యం సాధ్యమయ్యిందా.? అంటే, అంతకు మించిన మెరుగైన పాలన నడుస్తోందన్నది వైఎస్సార్సీపీ నేతల వాదన.

అయితే, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, రాష్ట్రంలో చిత్ర విచిత్రమైన రాజకీయాలు వెరసి.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ముఖ్యమంత్రిగా సాధించాల్సింది ఇంకా చాలానే వుంది. మూడు రాజధానులు, పోలవరం ప్రాజెక్టు.. ఇలా చాలా బాధ్యతలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద వున్నాయి.

అయితే, గడచిన రెండేళ్ళలో రాజధాని మీద స్పెషల్ ఫోకస్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పెట్టలేదన్న విమర్శలు లేకపోలేదు. అమరావతిని తొలుత అభివృద్ధి చేసి, ఆ తర్వాత మిగతా రెండు రాజధానుల మీద ఫోకస్ పెడితే బావుండేదన్న చర్చ జరుగుతోంది. ఈ విషయంలో వైఎస్ జగన్, ఒకింత తన ఆలోచనా సరళిని మార్చుకోవాల్సి వుంది.

కాగా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో సంక్షేమ పథకాల అమలు కష్టంగానే వున్నా, రికార్డు స్థాయిలో అప్పులు చేయడం ద్వారా అలా అలా నెట్టుకొచ్చేస్తున్నారు. అదే సమయంలో, రాష్ట్రంలో పన్నుల భారం క్రమక్రమంగా పెరుగుతోంది.

వీటన్నిటి నడుమ, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘సంకల్పం’ నెరవేరిందని చెప్పడం కష్టమే. ముఖ్యమంత్రి పదవి వరకూ ఆయన సంకల్పం నెరవేరినట్లే. ప్రజా రంజకమైన పాలన.. అంటే, దానికి ఇంకా చాలా దూరం వుందనే అనుకోవాలేమో.