సంప్రదాయ భోజనం ‘అమ్మకం’పై వెనక్కి తగ్గిన టీటీడీ

టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి డ్యామేజీ కంట్రోల్ చర్యలకు ఉపక్రమించక తప్పలేదు సంప్రదాయ భోజనం విషయమై. సంప్రదాయ బోజనం పేరుతో తక్కువ ఖర్చుకే భక్తులకు భోజనం అందించాలన్న ఆలోచన చేసింది టీటీడీ. అయితే, తిరుమల కొండ మీద.. టీటీడీ, సంప్రదాయ భోజనం పేరుతో ‘వ్యాపారం’ చేయాలనుకోవడమేంటి.? అని భక్తుల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ‘అది వ్యాపారం కాదు. సంప్రదాయ భోజనాన్ని లాభాపేక్ష లేకుండా భక్తులకు అందించాలనే గొప్ప సంకల్పం..’ అని టీటీడీ చెప్పుకొచ్చింది. అయినాగానీ, భక్తులు టీటీడీ వివరణ పట్ల సంతృప్తి చెందలేదు. తిరుమల తిరుపతి శ్రీవెంకటేశ్వరస్వామి దర్శనం కోసం వచ్చే భక్తులను నిలువు దోపిడీ చేస్తున్నారంటూ భక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నిజానికి, ఇది ఇంకా అమల్లోకి రాలేదు.

ప్రయోగాత్మకంగా చేపట్టిన ఓ కార్యక్రమం మాత్రమే. ఇంతలోనే తీవ్ర వ్యతిరేకత రావడంతో, సంప్రదాయ భోజన అమ్మకాన్ని పక్కన పెట్టింది టీటీడీ. ఈ విషయాన్ని స్వయంగా టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. తిరుమల కొండపై అన్నాన్ని ప్రసాదంగా ఇస్తున్నామనీ, సంప్రదాయ భోజనం పేరుతో భోజనాన్ని విక్రయించలేమనీ చెప్పారు. నిజానికి, చాలా మంచి మాట ఇది. అయితే, ప్రభుత్వ పెద్దలకు తెలియకుండా టీటీడీ అధికారులు ఈ నిర్ణయం తీసుకోగలరా.? అన్నదే అసలు ప్రశ్న. ‘టీటీడీ పాలక మండలి లేకుండా తీసుకున్న నిర్ణయమిది..’ అని వైవీ సుబ్బారెడ్డి చెబుతున్నారు. టీటీడీకి వివాదాలు కొత్త కాదు. ‘సంప్రదాయ భోజనం పేరుతో లాభాపేక్ష లేకుండా తాము గొప్ప కార్యక్రమం చేపడితే, దాన్ని కొందరు వివాదాస్పదం చేసి, లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు..’ అంటూ టీటీడీ తరఫున వివరణ రావడమంటేనే, ఈ పథకాన్ని అమలు చేయడానికి సర్వ సన్నద్ధంగా టీటీడీ వుందని అనుకోవాలి. ఎలాగైతేనేం, వైవీ సుబ్బారెడ్డి ప్రకటనతో ఇక్కడికి ఈ వివాదానికి ముగింపు పడ్డట్టే భావించాలి.