కలల లోకం అద్భుతం, అంతే కాదు అంతుచిక్కని రహస్యం కూడా. రాత్రి నిద్రలోకి జారుకున్న వెంటనే మనకు తెలియకుండానే మనసు ఒక వింత ప్రయాణం మొదలుపెడుతుంది. ఆ ప్రయాణంలో కొన్ని ముఖాలు, కొన్ని సంఘటనలు మళ్లీ మళ్లీ కనిపిస్తుంటాయి. ముఖ్యంగా ఒకే వ్యక్తి పదే పదే కలలలోకి రావడం చాలామందిని అయోమయంలోకి నెట్టేస్తుంది. ఎందుకు ఈ వ్యక్తే? అనే ప్రశ్న నిద్ర లేచిన తర్వాత కూడా మనసును వెంటాడుతూనే ఉంటుంది.
మన రోజువారీ జీవితంలో ఎదురయ్యే భావోద్వేగాలు, ఒత్తిళ్లు, చెప్పలేని ఆలోచనలు అన్నీ నిద్రలో మన ఉపచేతన మనస్సులో తిరిగి రూపుదిద్దుకుంటాయి. మనం బయటకు చెప్పలేని బాధ, లోపల దాచుకున్న ప్రేమ, పూర్తిగా ముగియని సంబంధం ఇవన్నీ కలల రూపంలో బయటపడతాయని మనస్తత్వ నిపుణులు చెబుతున్నారు. ఆ వ్యక్తి మీ జీవితంలో ప్రస్తుతం లేకపోయినా, మీ మనసులో మాత్రం ఇంకా ఓ స్థానం కలిగి ఉండటం వల్లే కలల్లో పదే పదే కనిపించే అవకాశం ఉంటుంది.
పరిశోధనల ప్రకారం, కలలు మన మెదడు భావాలను సర్దుబాటు చేసుకునే ప్రక్రియలో భాగం. మనసులో unresolved emotions ఉన్నప్పుడు, అవే కలల్లో పాత్రలుగా మారతాయి. కొన్నిసార్లు ఆ వ్యక్తి నిజంగా ఉన్న వ్యక్తి కాకపోయినా, అతను లేదా ఆమె సూచించే భావమే ప్రధానమైనది. భద్రత, భయం, అపరాధ భావన లేదా కోల్పోయిన అనుబంధం ఏదో ఒక భావానికి ఆ వ్యక్తి ప్రతీకగా మారుతాడు.
మనస్తత్వ శాస్త్రంలో ప్రముఖులైన సిగ్మండ్ ఫ్రాయిడ్ కలలను అణచివేయబడిన కోరికల ప్రతిబింబంగా చూశారు. కార్ల్ జంగ్ మాత్రం కలలను మన అంతర్మనస్సు ఉపయోగించే చిహ్నాల భాషగా వివరించారు. ఆధునిక నిపుణుల అభిప్రాయం ప్రకారం, పదే పదే వచ్చే కలలు మనం వాస్తవ జీవితంలో ఎదుర్కొనకుండా తప్పించుకుంటున్న సమస్యలపై మనసు వేసే ప్రశ్నలే.
అయితే, ఈ కలలు భయాన్ని, ఆందోళనను పెంచుతూ నిద్రను భంగం చేస్తున్నాయా? రోజువారీ జీవితం ప్రభావితం అవుతోందా? అలా అయితే వాటిని తేలికగా తీసుకోకుండా, మనసులోని భావాలను అర్థం చేసుకోవడం లేదా నిపుణుల సహాయం తీసుకోవడం అవసరం. ఎందుకంటే కలలు ఊహలు మాత్రమే కావు.. అవి మన మనస్సు పట్టుకున్న అద్దాలు. వాటిలో కనిపించే ప్రతిబింబాన్ని అర్థం చేసుకుంటే, మనలో దాగి ఉన్న భావాల గుట్టు నెమ్మదిగా విప్పబడుతుంది.
