మళ్ళీ అదే పాత రచ్చ షురూ అయ్యింది. విద్యార్థులకు కరోనా సమయంలో పరీక్షలు అవసరమా.? అని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ‘మాకు పరీక్షలొద్దు మొర్రో..’ అని విద్యార్థులు వాపోతున్నారు. ప్రభుత్వమేమో పరీక్షలు నిర్వహించి తీరతామంటోంది. ఈ క్రమంలో రాజకీయ విమర్శలు తెరపైకొస్తున్నాయి. అవసరమా ఇదంతా.? దేశంలో చాలా రాష్ట్రాలు పదో తరగతి పరీక్షల్ని రద్దు చేసినప్పుడు, ఆంధ్రపదేశ్ విద్యార్థులు మాత్రమే పరీక్షలు లేకపోతే ఎందుకు నష్టపోతారు.? ఈ మాత్రం ఆలోచన ప్రభుత్వ పెద్దలకు లేదని అనుకోలేం. అవకాశం వుంటే, ఖచ్చితంగా పరీక్షలు నిర్వహించాలన్నదే ప్రభుత్వం ఉద్దేశ్యం.
జూన్ మొదటి వారంలో పరీక్షలు జరగాల్సి వుండగా, అప్పటికి ఇంకా సమయం వుంది గనుక, ఈలోగా ఏర్పాట్లు మాత్రం చేసేసుకుంటారు. ఇందులో తప్పేమీ లేదు. అయితే, పరీక్షలు నిర్వహించి తీరతాం.. అని ప్రభుత్వ పెద్దలు చెబుతుండడమే ఆక్షేపణీయం. విద్యార్థులు, పరీక్షల విషయమై తీవ్ర మనో వేదనకు గురవుతున్నారు. కరోనా సమయంలో వారి ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు ఆ టెన్షన్. పెద్దగా సమయం కూడా లేనందున, ప్రభుత్వం కీలక నిర్ణయం వీలైనంత త్వరగా తీసుకుంటేనే మంచిది. ఎవరన్నా కోర్టును ఆశ్రయిస్తే, ఆ తర్వాత కోర్టు నుంచి మొట్టికాయలు పడితే.. అదంతా అవసరమా.? అన్న చర్చ వైసీపీ వర్గాల్లో కూడా వ్యక్తమవుతోంది. ఇటీవల ఇంటర్మీడియట్ పరీక్షల విషయంలోనూ అంతే. వివాదం రాజుకుంది.. క్రెడిట్ విపక్షాలకు వెళ్ళింది. ఇంటర్మీడియట్ పరీక్షలు గనుక, వాయిదా వేయడానికి అవకాశం దొరికింది. పదో తరగతి పరీక్షలకు వాయిదా కష్టం.. రద్దు చేయడం తప్ప లేదింకో మార్గం.