సజ్జల ఉవాచ: నారాయణ బెయిల్ రద్దుపై హైకోర్టునాశ్రయించనున్న ఏపీ సర్కారు.!

Sajjala Says : మాజీ మంత్రి నారాయణ, ప్రశ్నా పత్రాల లీకేజీ వ్యవహారంలో అరెస్టయి, బెయిల్ మీద విడుదలైన దరిమిలా, ఈ వ్యవహారాన్ని వైఎస్ జగన్ సర్కారు మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టుంది. వైసీపీ ముఖ్య నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తాజాగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఈ వ్యవహారంపై మాట్లాడారు.

నారాయణ అరెస్టుపై చంద్రబాబు కేంద్ర హోంమంత్రికి లేఖలు రాసినా ప్రయోజనం లేదన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. నారాయణ బెయిల్ మీద విడుదలవడంపై తమ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయిస్తుందని సజ్జల చెప్పుకొచ్చారు. ప్రశ్నా పత్రాల లీకేజీ వ్యవహారంలో నారాయణ ప్రధాన సూత్రధారి అని సజ్జల ఆరోపించడం గమనార్హం.

ఇప్పటికే ఈ కేసులో పలువురు అరెస్టు కాగా, వారి నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా నారాయణను పోలీసులు అరెస్ట్ చేసినట్లు సజ్జల చెప్పారు. అయితే, మెజిస్ట్రేట్ ముందు నారాయణ తరఫు వాదనలు వినిపించిన న్యాయవాదులు, నారాయణకు నారాయణ విద్యా సంస్థలతో సంబంధం లేదని పేర్కొనడం గమనార్హం.
రేపు హైకోర్టులోనూ ఇవే తరహా వాదనలు ఖచ్చితంగా జరుగుతాయి. ప్రశ్నా పత్రాల కేసులో అరెస్టయిన నిందితులకు, నారాయణతో నేరుగా సంబంధాలు వున్నాయని నిరూపిస్తే తప్ప, ప్రభుత్వం ఈ కేసులో పైచేయి సాధించే అవకాశాల్లేవు.
హైకోర్టులో ప్రభుత్వానికి చుక్కుదురైతే, ఇంకోసారి పరువు పోగొట్టుకోవడమే అవుతుందన్న వాదన వైసీపీ వర్గాల్లోనూ వినిపిస్తోంది.