జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఏపీ రాజకీయాల్లో చాలా మార్పులు వచ్చాయి. వైఎస్సార్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చాక.. టీడీపీ ఘోరంగా ఓడిపోయాక.. టీడీపీ నేతలు కాస్త సైలెంట్ అయిపోయారు. వైఎస్సార్సీపీకి చెందిన పెద్దలు మాత్రం ఏపీలో చక్రం తిప్పడానికి ప్రయత్నిస్తున్నారు. నిజానికి జగన్ ముఖ్యమంత్రి అయినప్పటికీ.. కొందరు వైసీపీ బడా నాయకులు ఏపీలో రాజకీయాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.
వైసీపీ అధినేత జగనే అయినప్పటికీ.. ఏపీ సీఎం కూడా జగన్ అయినప్పటికీ.. కొందరి చేతుల్లోనూ అధికారం ఉందని.. వాళ్లు ఎంత చెబితే అంతే అనే వార్తలు మొదటి నుంచీ వినిపిస్తున్నాయి.
దానికి ఉదాహరణ… సజ్జల రామకృష్ణారెడ్డి. ఆయన వైసీపీకి చెందిన ముఖ్య నేత, సీఎం జగన్ రాజకీయ సలహాదారుడు, వ్యూహాత్మక నేత.. అంతే కాదు.. ఆయన ఏపీకి షాడో చీఫ్ మినిస్టర్ అని అంటున్నారు వైసీపీ నేతలు. ముఖ్యమంత్రి కాకముందు జగన్.. ఎవరికైనా ఏదైనా సమస్య ఉంటే ఆయనే పరిష్కరించేవారని.. తమకు ఏదైనా సమస్య ఉన్నా… జగన్ దగ్గరికే డైరెక్ట్ గా వెళ్లి పరిష్కరించుకునేవాళ్లమని.. ప్రస్తుతం అటువంటి పరిస్థితి లేదని వైసీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు.
ప్రస్తుతం తమకు ఏదైనా సమస్య వస్తే… ఆ సమస్యను వెళ్లి సీఎంకు చెప్పుకునే అవకాశం లేదని… ఏదైనా ఉంటే.. సజ్జల సార్ తోన మాట్లాడండి.. అంటూ తమకు సీఎంవో నుంచి సమాచారం వస్తోందని.. సజ్జలకు తమ సమస్యలు విన్నవించినా.. పరిష్కారం మాత్రం దొరకడం లేదని వైసీపీ నేతలు వాపోతున్నారు.
మరోవైపు సజ్జలకు అనుకూలంగా ఉన్నవారికి మాత్రం పనులవుతున్నాయని.. వేరే నేతల సమస్యలపై ఎవ్వరూ స్పందించడం లేదని అంటున్నారు. ఇటీవలే గుంటూరులో జరిగిన ఉదాహరణనే వైసీపీ నేతలు చెప్పుకొస్తున్నారు.
ఇలా.. క్షేత్రస్థాయి వైసీపీ నేతల సమస్యలను పార్టీ హైకమాండ్ వినకపోవడం.. కనీసం ముఖ్యమంత్రికి సమస్యలు చెప్పుకునే అవకాశం కూడా ఉండకపోవడంతో భవిష్యత్తులో పార్టీకి తీవ్రమైన నష్టం వాటిల్లే ప్రమాదముందని వైసీపీ నేతలు చెబుతున్నారు.
సజ్జల వ్యవహారంపై నాయకులు అసంతృప్తితో ఉన్నా… ఆయన గురించి ఎక్కడైనా మాట్లాడితే.. పార్టీ నుంచి ఎక్కడ తమని బయటికి పంపిస్తారోనని వైసీపీ నేతలు మింగలేక.. కక్కలేక అన్న పరిస్థితిలో ఉన్నారు. ఇది దీర్ఘకాలంలో పార్టీకి తీరని చేటని వాపోతున్నారు.