Saif Ali Khan: సైఫ్ అలీ ఖాన్ హెల్త్ అప్డేట్…. స్పైన్ వద్ద లోతైన గాయం… కొనసాగుతున్న సర్జరీ?

Saif Ali Khan: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పట్ల జరిగిన దాడితో ఒక్కసారిగా బాలీవుడ్ ఇండస్ట్రీ ఉలిక్కిపడింది. గత రాత్రి రెండు గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తి సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి చొరబడ్డారు. అది గమనించిన పనివారు తనని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో వారిపై దాడి చేస్తున్న నేపథ్యంలో పని వారిని కాపాడటం కోసం సైఫ్ అలీ ఖాన్ వెళ్ళగా ఆ వ్యక్తి ఈయనపై కత్తితో దాడి చేశారు.

ఇలా సైఫ్ అలీ ఖాన్ పై ఏకంగా ఆరుసార్లు కత్తితో దాడి చేసినట్లు తెలుస్తోంది ఇలా రక్తపు మడుగులలో ఉన్నటువంటి ఈయనని ముంబైలోని లీలావతి హాస్పిటల్ లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు అయితే ప్రస్తుతం ఆయన హెల్త్ అప్డేట్ ఏంటి అసలు ఈ దాడికి పాల్పడిన వ్యక్తి ఎవరు అనే విషయంపై సర్వత్ర ఆసక్తి నెలకొంది అయితే తాజాగా సైఫ్ అలీ ఖాన్ ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందనే విషయంపై డాక్టర్స్ అప్డేట్ ఇచ్చారు.

తెల్లవారు జామున 3 నుంచి 3:30 నిమిషాల మధ్య సైఫ్ అలీ ఖాన్‌ ఆసుపత్రిలో అడ్మిట్ అయినట్లు లీలావతి ఆసుపత్రి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నీరజ్ ఉత్తమణి తెలిపారు. ఆయన శరీరంపై మొత్తం ఆరుచోట్ల గాయాలు అయినట్లు తెలియజేశారు. ఇక రెండు చోట్ల గాయం లోతుగా తగిలినట్లు డాక్టర్లు తెలిపారు. న్యూరోసర్జన్ డాక్టర్ నితిన్ డాంగే, కాస్మటిక్ సర్జన్ డాక్టర్ లీలా జైన్, అనస్థీషియన్ నిషా గాంధీ ఆధ్వర్యంలో సైఫ్‌కు ట్రీట్‌మెంట్ అందిస్తోన్నామని తెలిపారు. ఇప్పటికే రెండు సర్జరీలు నిర్వహించామని పేర్కొన్నారు.

శరీరం మొత్తంలో ఆరుచోట్ల గాయాలు అయినప్పటికీ మెడ, వెన్నెముక భాగంలో గాయం లోతుగా అయినట్లు డాక్టర్లు తెలియజేశారు. అందులో చిన్న వస్తువు ఇరుక్కున్నట్లు గుర్తించామని తెలిపారు. జాగ్రత్తగా దాన్ని తొలగించాల్సి ఉంటుందని, సర్జరీ కొనసాగుతోందని పేర్కొన్నారు. ఇక ఈయన పరిస్థితి గురించి ప్రతి ఒక్క సెలబ్రిటీ కూడా అడిగి మరీ తెలుసుకుంటున్నారు. ఇక ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్న ముంబై పోలీసులు ఏడు బృందాలుగా విడిపోయి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.