రోడ్డు ప్రమాదం: సాయిధరమ్ తేజ్ క్షేమంగానే వున్నాడుగానీ..

యువ హీరో సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడనీ, ఈ ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడ్డాడనీ, బ్రేకింగ్ న్యూసులు రావడంతో ఒక్కసారిగా మెగాభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. సినీ పరిశ్రమ షాక్‌కి గురయ్యింది. సాయిధరమ్ తేజ్ అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడన్న వార్త మరింతగా అందర్నీ కలచివేసింది. పవన్ కళ్యాణ్ సహా మెగా కుటుంబానికి చెందిన పలువురు ప్రముఖులు సాయిధరమ్ తేజ్ చికిత్స పొందుతోన్న ఆసుపత్రికి వెళ్ళి, వైద్యుల్ని అడిగి ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. అపస్మారక స్థితిలో వున్నా, పెద్దగా ప్రమాదమేమీ లేదని పవన్ కళ్యాణ్ ప్రకటించడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారంతా. రాత్రికి రాత్రికి సాయిధరమ్ తేజ్‌ని మరో ఆసుపత్రికి (అపోలో) తరలించారు. అక్కడాయనకు అదనంగా మరికొన్ని వైద్య పరీక్షలు నిర్వహించి, ప్రమాదమేమీ లేదని ధృవీకరించారు వైద్యులు.

సాయి ధరమ్ తేజ్ మద్యం సేవించలేదని, హెల్మెట్ ధరించాడనీ పోలీసులు పేర్కొన్నారు. అయితే, అతి వేగానికి సంబంధించి స్పష్టత రావాల్సి వుంది. ప్రమాదానికి కారణమైన బైక్ ఎవరిది.? సాయిధరమ్ తేజ్ ప్రమాదకర రీతిలో డ్రైవింగ్ చేశాడా.? వంటి విషయాలు తేలాల్సి వుంది. స్వతహాగా బైక్ డ్రైవింగ్ అంటే ఇష్టపడే సాయి ధరమ్ తేజ్, అతి ఖరీదైన బైక్ మీద అత్యంత వేగంగా దూసుకెళ్ళాడనే ప్రచారమైతే జరుగుతోంది. ఇదిలా వుంటే, రోడ్డు మీద పేరుకుపోయిన మట్టి, ఇసుక (వర్షాల కారణంగా) వల్లనే ప్రమాదం జరిగిందని పోలీసులు పేర్కొంటుండడం గమనార్హం. హెల్మెట్ పెట్టుకోకపోతే జరీమానా, అతి వేగంగా వెళితే జరీమానా.. మరి, రోడ్లపై ఇసుక, మట్టి పేరుకుపోతే జరీమానా ఎవరికి పోలీసులు విధిస్తారో ఏమో.? అన్న చర్చ ఇప్పుడు జరుగుతోంది. ప్రముఖుల ప్రాణాల మీదకు వచ్చినప్పుడు ఇలాంటి చర్చ జరగడం సహజమే. వాహనదారుల మీద చలాన్లు వేయడం మీద శ్రద్ధ పెట్టే పోలీసులు, రోడ్ల నిర్వహణలో వైఫల్యంపైనా జరీమానాలు విధిస్తే.. రోడ్డు ప్రమాదాలు గణనీయంగా తగ్గుతాయన్నది సర్వత్రా వినిపిస్తోన్న అభిప్రాయం.