దేశ రాజధాని ఢిల్లీలోని విమానాశ్రయంలో సౌకర్యాలు, జాగ్రత్తలు అంతంతమాత్రంగానే ఉన్నాయని ప్రయాణీకుల నుండి చాలాసార్లు ఫిర్యాదులు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి సైతం ఈ విషయం మీద స్పందించారు. ఎందుకంటే ఆయనకు కూడ ఢిల్లీ విమానాశ్రయంలో ఊహించని సీన్ కనబడింది. వివరాల్లోకి వెళితే నిన్న రాత్రి రాజమౌళి లుఫ్తాంజా ఎయిర్ లైన్స్ విమానంలో ప్రయాణించి ఢిల్లీ విమానాశ్రయంలో దిగారు. ప్రధాన విమానాశ్రయం కావడం, కరోనా ఉధృతి ఉండటంతో బయటి నుండి దేశంలోకి వచ్చే ప్రతి ప్రయాణీకుడికి ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయడం అక్కడి నిబంధన.
ఆ నిబంధనల్లో భాగంగానే అందరి ప్రయాణీకులకు పరీక్ష కోసం ఫిల్ చేయాల్సిన ఫార్మ్స్ ఇచ్చారట. ఫామ్స్ అయితే ఇచ్చారు కానీ కూర్చుని ఫిల్ చేయడానికి కనీసం టేబుల్స్ కూడ వేయలేదట. దాంతో అందరూ కింద నెల మీద కూర్చొని, గోడలకు ఆనుకుని ఫామ్స్ ఫిల్ చేస్తున్నారట. అంతేకాదు ఎగ్జిట్ ద్వారం వద్ద వీధి శునకాలు యథేచ్ఛగా తిరుగుతున్నాయట. దేశ రాజధాని ఢిల్లీ విమానాశ్రయంలో ఇవన్నీ చూసి అప్సెట్ అయిన రాజమౌళి కనీస సౌకర్యాలు, పరిసరాల పట్ల సరైన జాగ్రత్త లేవని వీటి వలన మొదటిసారి ఇండియాకు వచ్చే విదేశీయులకు మన దేశం మీద అంత మంచి అభిప్రాయం ఏర్పడదని, త్వరగా వీటిని సరిచేయాలని ఢిల్లీ విమానాశ్రయ అధికారులను ట్విట్టర్ ద్వారా కోరారు.