కరోనా వల్ల మార్చి నెల నుంచి ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సుల రాకపోకలే నిలిచిపోయాయి. క్రమక్రమంగా కేంద్ర, ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు లాక్ డౌన్ ను సడలించినా.. రెండు రాష్ట్రాల మధ్య బస్సులు మాత్రం నడవలేదు.
ఇటీవల దసరా పండుగ వచ్చినా.. రెండు రాష్ట్రాల బోర్డర్ల వరకే బస్సులు నడిచాయి. దీంతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. మళ్లీ కొన్ని రోజుల్లో దీపావళి, ఆ తర్వాత తెలుగు వారి అతిపెద్ద పండుగ సంక్రాంతి రానున్న నేపథ్యంలో ఇరు రాష్ట్రాల ఆర్టీసీ అధికారులు కాస్త దిగి వచ్చారు. ఇరు రాష్ట్రాల అధికారల మధ్య సోమవారం జరిగిన చర్చలు సఫలం అయ్యాయి.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఆర్టీసీ అధికారుల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం.. ఏపీకి తెలంగాణ నుంచి 826 ఆర్టీసీ బస్సులు రానున్నాయి. అలాగే తెలంగాణకు ఏపీ నుంచి 638 బస్సులు రానున్నాయి. దానితో పాటు.. విజయవాడ రూట్ లో 273 తెలంగాణ ఆర్టీసీ బస్సులను నడపనున్నారు. అదే రూట్ లో ఏపీ ఆర్టీసీకి చెందిన 192 బస్సులను నడపనున్నారు.