తిరుపతి ఉపఎన్నికల వేళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై జనసేన విమర్శల దాడిని తీవ్రతరం చేసింది. వైసీపీ ప్రభుత్వం రోజుకు రూ.500 కోట్ల అప్పు చేస్తోందని సంచలన ఆరోపణలు చేసింది. దుష్టపాలన అందిస్తున్న వైసీపీ పట్ల ప్రజల వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోందని జనసేన పార్టీ నేత నాదెండ్ల మనోహర్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. జనసేన, బీజేపీ సమన్వయ సమావేశం కోసం ఆదివారం సాయంత్రం ఆయన తిరుపతి చేరుకున్నారు. తిరుపతి ఎయిర్‌పోర్టులో మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు నాదెండ్ల మనోహర్.
వైఎస్ జగన్ ప్రభుత్వం రోజుకు రూ.500 కోట్ల అప్పులు చేసి ప్రజలను మభ్యపెడుతోంది. పరిపాలనన గాలికి వదిలేసి ఇసుక, మద్యం, సిమెంట్ వ్యాపారానికే సీఎం జగన్, ఆయన అనుచరులు పరిమితమయ్యారు. సంక్షేమ పథకాల పేరిట ప్రజలను మబ్బులో ఉంచాలని ప్రయత్నిస్తోంది. ఎన్నికల్లో దౌర్జన్యాలు, అధికార దుర్వినియోగం చేయడాన్ని రాష్ట్రంలో తొలిసారి చూస్తున్నాం. వైసీపీ పోకడలను జనసేన ధీటుగా ఎదుర్కొంటుంది. రాబోయే రోజుల్లో బలమైన శక్తిగా ఎదుగుతాం అని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.
పవన్ కల్యాణ్ కోరినట్లుగానే తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికల్లో మంచి అభ్యర్థిని బీజేపీ నిలబెట్టిందని ఆయన అన్నారు. ఐఏఎస్ అధికారిణిగా ఎంతో అనుభవం ఉన్న రత్నప్రభ ఎంపీగా ఎన్నికైతే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఆ నమ్మకంతోనే రత్నప్రభ విజయానికి జనసేన శ్రేణులు కృషిచేయాలని పవన్ కల్యాన్ ఆదేశించారని చెప్పారు.కాగా, ఏపీలో తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నికలు కాకా రేపుతున్నాయి. వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మరణంతో ఉపఎన్నికలు అనివార్యమయ్యాయి. ఈ ఎన్నికల్లో వైసీపీ తరపున గురుమూర్తి, టీడీపీ తరపు పనబాక లక్ష్మి, కాంగ్రెస్ తరపున చింతా మోహన్ పోటీ చేస్తున్నారు. జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా రత్నప్రభ పోటీ బరిలో ఉన్నారు. ఏప్రిల్ 17న తిరుపతి లోక్ సభ స్థానానికి ఉపఎన్నిక జరగనున్నాయి.