‘నేను గాయపడ్డ పులిని.. గాయపడ్డ పులి వేట ఎలా వుంటుందో ముందు ముందు మీరే చూస్తారు..’ అంటూ పశ్చిమబెంగాల్ ఎన్నికల నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ సంచలన రీతిలో భారతీయ జనతా పార్టీని హెచ్చరించిన విషయం విదితమే.
బీజేపీ అంచనాలు తల్లకిందులయ్యాయి.. మమతా బెనర్జీ మరోమారు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి అయ్యారు. ఆమె స్వయంగా ఓడిపోయినా, పార్టీని గెలిపించారు. తిరిగి గద్దెనెక్కారు. అయితే, తృణమూల్ మెడ మీద ఇంకా కత్తి అలాగే వుందనీ, మమతా బెనర్జీ తిరిగి ఏదో ఒక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలవకపోతే, ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోలేరనీ, అలాంటి పార్టీలో నేతలు ఎక్కువ కాలం వుండలేరనీ బీజేపీ ఎగతాళి చేస్తూ వచ్చింది.
కానీ, బీజేపీకి షాకిచ్చేలా మమతా బెనర్జీ ఆపరేషన్ ఆకర్షకి తెరలేపారు. ‘ఎన్నికలకు ముందు తృణమూల్ కాంగ్రెస్ పార్టీని వీడిన నేతల్ని తిరిగి పార్టీలోకి రానివ్వం..’ అని ఓ వైపు చెబుతూనే, తృణమూల్ పార్టీని వీడి బీజేపీలో చేరిన సీనియర్ నాయకులకు గాలం వేస్తున్నారు మమతా బెనర్జీ. ఇప్పటికే అరడజను మంది ముఖ్య నేతలు బీజేపీని వీడి తిరిగి తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాజాగా ముకుల్ రాయ్ అనే సీనియర్ పొలిటీషియన్ కూడా మమతా బెనర్జీ పంచన చేరారు.
‘బెంగాల్ బీజేపీలో ఎవరూ వుండరు.. త్వరలో ఆ పార్టీ ఖాళీ అయిపోతుంది..’ అంటూ తాజాగా మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలతో బీజేపీలో కలవరం బయల్దేరింది. మమతా బెనర్జీ మీద గులిచిన సువేందు అధికారిని ఢిల్లీ పిలిపించుకున్న బీజేపీ, ఆయనకు భరోసా ఇస్తోంది. కానీ, ఆయన కూడా రేపో మాపో మమత పంచన చేరే అవకాశం వుందంటున్నారు. బెంగాల్ రాజకీయాల్లో నిజంగానే బెబ్బులిగా చెప్పుకోవాలి మమతా బెనర్జీని.