ప్రశాంత్ కిషోర్ నీతులు చెబుతోంటే.! నవ్విపోదురుగాక.!

ఎవరీ ప్రశాంత్ కిషోర్.! దేశంలో రాజకీయాల పట్ల కాస్తో కూస్తో అవగాహన వున్నోళ్ళందరికీ తెలుసు, ప్రశాంత్ కిషోర్ అంటే ఎవరో. చేతిలో ఐ-ప్యాక్ అనే టీమ్ ఒకటి వుంటుంది. దానికి సృష్టికర్త ఆయనే. ఆ ఐ-ప్యాక్ టీమ్‌లో విద్యాధికులే పనిచేస్తుంటారండోయ్.!

కానీ, వాళ్ళంతా గ్రామ స్థాయికి వెళ్ళి, రాజకీయ పార్టీల బలాబలాల గురించి తెలుసుకుంటుంటారు. పరిస్థితుల్ని అంచనా వేస్తుంటారు. గెలుపు సూత్రాల్ని ఆయా రాజకీయ పార్టీలకు తెలియజేస్తుంటారు. ఇదీ ప్రశాంత్ కిషోర్, ఆయన టీమ్ చేసే పని.

ఆ పార్టీ, ఈ పార్టీ అన్న తేడాల్లేవ్. విలువలు, విశ్వసనీయత.. ఇవేమీ ఆయనకు తెలియవు. డబ్బులిస్తే, ఏ పార్టీ కోసం అయినా పని చేస్తాడు. 2019 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోసం పని చేశాడాయన. పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ పార్టీ కోసమూ ఆయనే పని చేశారు.

ఆమ్ ఆద్మీ పార్టీ, భారతీయ జనతా పార్టీ.. ఇలా ఆయన చాలా పార్టీలతో కలిసి పనిచేసిన సంగతి తెలిసిందే. తెలంగాణలో నిన్న మొన్నటిదాకా అధికార బీఆర్ఎస్ (పాత పేరు టీఆర్ఎస్)కి కూడా ప్రశాంత్ కిషోర్ సేవలందించాడు. లక్షల్లో కాదు, కోట్లల్లో ఆయనకు చెల్లింపులుంటాయ్. వందల కోట్లు.. అంటుంటారు కొందరు.

తాజాగా, సంక్షేమ పథకాల మీద సెటైర్లేశాడు ప్రశాంత్ కిషోర్. ‘సంపద సృష్టించకుండా, సంక్షేమ పథకాల పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తే రాష్ట్రమైనా, దేశమైనా నష్టపోతుంది..’ అంటూ ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యానించడం గమనార్హం.

బీహార్ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకుని (ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం ద్వారా) బొక్క బోర్లా పడ్డ ఘనుడు ఈ ప్రశాంత్ కిషోర్. కార్పొరేట్ రాజకీయాలు తెలిసిన ప్రశాంత్ కిషోర్, సంక్షేమ పథకాల గురించీ, ప్రజాస్వామ్యం గురించీ మాట్లాడితే.. నవ్విపోదురుగాక.. ఆయనకేటి సిగ్గు.. అనిపించకమానదు.