ఢిల్లీ రాజ్యంలో లోకల్ పార్టీ AAP కు షాక్ ఇచ్చి మొత్తానికి జెండా ఎగురవేసిన బీజేపీ నెక్స్ట్ టార్గెట్ ఆసక్తిని కలిగిస్తోంది. దేశ రాజకీయాల్లో పశ్చిమ బెంగాల్ కీలక రాష్ట్రంగా మారింది. ఎందుకంటే 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత, బీజేపీ మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని ఓడించడానికి మరింత దూకుడుగా వ్యూహాలు రచిస్తోంది. మూడుసార్లు ముఖ్యమంత్రిగా కొనసాగిన మమతా బెనర్జీపై ఈసారి బీజేపీ మరింత గట్టి పోటీ ఇవ్వనుంది. ముఖ్యంగా మోడీ-షా ద్వయం తమ వ్యూహాలను బెంగాల్‌లో విజయవంతం చేయడంపై దృష్టి సారించింది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) మేజిక్ ఫిగర్ దాటి మళ్లీ అధికారంలోకి వచ్చినప్పటికీ, బీజేపీ ఊహించని స్థాయిలో ప్రతిపక్షంగా ఎదిగింది. 2021 ఎన్నికల్లో భారీగా ఓట్లు సాధించినప్పటికీ, అధికారాన్ని చేజిక్కించుకోలేకపోయింది. అయితే, ఇప్పుడు పరిస్థితులు మారాయని బీజేపీ నేతలు విశ్వసిస్తున్నారు. మావోయిస్టు ప్రభావాన్ని తగ్గించడంతో పాటు, సరిహద్దుల్లో అక్రమ వలసదారులపై కఠిన చర్యలు తీసుకుంటూ ప్రజల్లో విశ్వాసాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నారు.
ప్రస్తుతం మమతా బెనర్జీ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు, పలు అంశాల్లో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరించడం వంటి అంశాలు ఆమెకు సమస్యగా మారే అవకాశముంది. బీజేపీ అభివృద్ధి నినాదాన్ని ప్రధానంగా ముందుకు తీసుకెళ్లి, మమత ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ప్రచారం చేయాలని వ్యూహరచన చేస్తోంది. మొత్తానికి బీజేపీ వచ్చే ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌ను గెలుచుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. అయితే, దీదీ బలమైన నాయకురాలు కావడంతో పోటీ తీవ్రంగా సాగనుంది. మమతా బెనర్జీకి ఇది రాజకీయంగా కఠిన పరీక్ష కానుండగా, బీజేపీకి మరో కీలక సమరం కానుంది.