ఎన్నికల్లో గెలిచినా అదృష్టం లేక మంత్రి పదవులు దక్కించుకోలేకపోయినా నేతల్లో ఆర్కే రోజా ఒకరు. ప్రతిపక్షంలో ఉండగా ఆమె దూకుడు చూసి జగన్ అధికారంకోకి వస్తే రోజాను కేబినెట్లోకి తీసుకుంటారని చాలామంది అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఆమెకు పదవి దక్కలేదు. పదవి కోసం ఆమె చాలానే ప్రయత్నాలు చేశారు. నేరుగా జగన్ వద్దే పంచాయితీ పెట్టుకున్నారు. కానీ సామాజికవర్గ సమీకరణాల దృష్ట్యా జిల్లా నుండి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పదవి ఇవ్వాల్సి రావడం, ఇంకో రెడ్డి నేతను కేబినెట్లోకి తీసుకునే వీలులేకపోవడం వలన జగన్ కూడ ఏమీ చేయలేకపోయారు. రెండున్నరేళ్ల తర్వాత మంత్రివర్గంలో మార్పులు చేస్తే పదవి ఇస్తానని చెప్పి ఆమెకు సర్దిచెప్పారు.
జగన్ మాట తప్పరనే నమ్మకంతో రోజా కూడ కొంతకాలం బాధపడినా ఆతరవాత సర్దుకుపోయారు. సీఎం వద్ద మంచి పేరు తెచ్చుకోవాలనే ఉద్దశ్యంతో గతంలో చేసినట్టే పార్టీ కోసం కష్టపడుతూ వచ్చారు. కానీ ఆమెకు సొంత పార్టీ నుండే ఇబ్బందులు మొదలయ్యాయి. నియోజకవర్గంలో ఆమెను డామినేట్ చేసే వ్యవహారాలు చాలానే జరుగుతున్నాయట. నగరిలో రోజాకు గిట్టని వర్గాలు కొన్ని ఉన్నాయి. ఒకే పార్టీ అయినా వారితో రోజాకు అస్సలు పొసగదు. అందుకే వారిని దూరంపెడుతుంటారు. ఇప్పుడు వారికే మంత్రిగారు మద్దతుగా నిలవడం రోజాకు నచ్చట్లేదు.
రోజా ప్రత్యర్థుల్లో ఒకరికి బీసీ కార్పొరేషన్ చైర్మన్ పదవిని కట్టబెట్టారు. దీంతో తనకు చెక్ పెట్టే వ్యూహాలు అమలవుతున్నాయని రోజా గ్రహించారు. ఇంతకుమునుపు నియోజకవర్గంలోని ప్రభుత్వ అధికారులు రోజా మాటను జవదాటేవారు కాదు. ఆమె కూడ వారితో చాలా సఖ్యతగా ఉంటూ పనులు చేయించుకునేవారు. అలాంటిదిప్పుడు ఆమె మాట చెల్లుబాటు కావట్లేదట. అవతల ఉన్నది పెద్ద వ్యక్తి కావడంతో ఒంటరిగా ఢీకొట్టినా ప్రయోజనం ఉండదని భావించిన రోజా జగన్ వద్దే తేల్చుకోవాలని డిసైడ్ అయ్యారట. ప్రస్తుతం ఆమె సీఎం అపాయింట్మెంట్ కోసం ఎదురుచూస్తున్నారట. ఒక్కసారి మీటింగ్ ఫిక్స్ అయితే తన ఇబ్బందులన్నీ చెప్పుకుని పరిష్కారం చెప్పమని అడగాలనుకుంటున్నారట. సమస్య వేరే ఎవరితో అయినా ఇంత రగడ ఉండేది కాదు కానీ జగన్ కు అత్యంత నమ్మకస్థుడు, ఆప్తుడితోనే కావడంతో జగన్ నిర్ణయం ఎలా ఉంటుందోనని అందరిలోనూ ఆసక్తి నెలకొంది.