MLA Roja : గట్టి చట్నీ గోలెందుకుగానీ.. ‘నగిరి’ మళ్ళీ మీదేనా.?

MLA Roja : చిత్తూరు జిల్లా నగిరి నియోజకవర్గం నుంచి మళ్ళీ రోజా పోటీ చేసే అవకాశమెంత.? ఈ ప్రశ్నకు నగిరి నియోజకవర్గ వైసీపీ నేతల్ని సమాధానం చెప్పమంటే, ‘జీరో ఛాన్స్’ అంటారేమో.! ‘రోజా తప్ప ఎవరైనా ఫర్వాలేదు..’ అంటై నగిరి వైసీపీలో మెజార్టీ నేతలు కుండబద్దలుగొట్టేస్తున్న వైనం గత కొద్దిరోజులుగా కనిపిస్తోంది.
అదేంటే, రోజా రాజకీయమే అంతే.. ఆమెకు ఎప్పుడూ సొంత పార్టీ నుంచే తలనొప్పులు. మొన్నామధ్య ఈ విషయమై రోజా కంటతడి కూడా పెట్టారు. అలాంటి రోజా, తెలుగుదేశం పార్టీ మీద పంచ్ డైలాగులు పేల్చుతున్నారు. సరే, రోజాకి టీడీపీలో వున్నప్పుడు ఎదురైన వెన్నుపోట్ల నేపథ్యంలో ఆమె అంతలా ‘బాకీ’ తీర్చేస్తుంటారనుకోండి.. అది వేరే సంగతి.
అచ్చెన్నాయుడు మీద ‘గట్టి చట్నీ’ ఆరోపణలు చాలా గట్టిగా చేశారు రోజా. ఇంకేముంది, తెలుగు తమ్ముళ్ళు సోషల్ మీడియా వేదికగా చెలరేగిపోతున్నారు. ‘ఇంతకీ, వచ్చే ఎన్నికల్లో నగిరి నుంచి పోటీ చేయడం ఖాయమేనా.? టిక్కెట్టు మీకు దొరుకుతుందా.? దొరకదా.? టీడీపీలోకి తిరిగొచ్చేందుకు మేమైతే ఒప్పుకోం..’ అంటూ తెలుగు తమ్ముళ్ళు మండిపడుతున్నారు.
అవసరమా ఇదంతా.? తొలి మంత్రి వర్గంలో చోటు దక్కించుకోలేకపోవడంతో రోజా అసమర్థత గురించి బోల్డంత చర్చ జరిగింది. ఏపీఐఐసీ ఛైర్మన్‌గిరీ దక్కినా.. అదీ ఎక్కువ కాలం నిలవలేదు. త్వరలో మంత్రి వర్గ విస్తరణ.. అనే ప్రచారం జరుగుతున్న దరిమిలా, వైసీపీ అధినేత.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్, రోజాని కరుణిస్తారో లేదో.!
ఏదిఏమైనా, అచ్చెన్నాయుడి ‘భారీ కాయం’ గురించి రోజా చేసిన విమర్శలూ ఆమెకు గట్టిగానే రివర్స్ ఎటాక్ రూపంలో వచ్చి తగులుతున్నాయి. ఇలాంటివి రాజకీయాల్లో అవాంఛనీయం. ‘అందరివాడు’ అన్పించుకున్న గౌతమ్ రెడ్డి లాంటోళ్ళను స్ఫూర్తిగా తీసుకుంటే రాజకీయాల్లో రాణిస్తారన్న విషయం రోజాకి ఎప్పుడర్థమవుతుందో ఏమో.!