Roja: 2024 ఎన్నికలలో వైసీపీ ఘోర ఓటమి పాలయ్యింది. ఇలా వైకాపా ఓడిపోవడంతో జగన్మోహన్ రెడ్డి తిరిగి తన పార్టీని రాష్ట్రవ్యాప్తంగా బలోపేతం చేసుకోవడం కోసం పెద్ద ఎత్తున కీలక నిర్ణయాలను తీసుకుంటూ ఉన్నారు. ఏ ఏ ప్రాంతంలో అయితే వారి అభ్యర్థులకు పూర్తిస్థాయిలో వ్యతిరేకత ఏర్పడిందో అలాంటి ప్రాంతాలలో ఇన్చార్జులను కూడా ఈయన మారుస్తున్నారు. ఈ క్రమంలోనే నగరి నియోజక వర్గంపై కూడా జగన్మోహన్ రెడ్డి ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారని తెలుస్తుంది.
నగరి నియోజకవర్గంలో నుంచి రెండుసార్లు వైసీపీ తరఫున రోజా పోటీ చేసి గెలుపొందారు అయితే ఈమె కేవలం 2000 ఓట్ల మెజారిటీతో మాత్రమే గెలిచారు కానీ గత ఎన్నికలలో రోజాపై టిడిపి అభ్యర్థి ఏకంగా 50వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించడంతో ఆ ప్రాంతంలో రోజాకు ఏ స్థాయిలో వ్యతిరేకత ఏర్పడిందనేది స్పష్టం అవుతుంది. ఈ క్రమంలోనే నగరిలో తిరిగి అధికారం అందుకోవాలి అంటే తప్పనిసరిగా అభ్యర్థిని మార్చాల్సిన అవసరం ఉందని జగన్ భావించినట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం నగరి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గాలి ముద్దు కృష్ణమ్మ నాయుడు కుమారుడు భాను ప్రకాష్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు అయితే ఈయన సోదరుడు గాలి జగదీష్ కి తనతో భేదాభిప్రాయాలు రావడంతో గాలి జగదీష్ ను జగన్మోహన్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తూ నగరి నియోజకవర్గ బాధ్యతలను ఆయనకు అప్పగించాలని చూస్తున్నారట.
ఇదే విషయంపై రోజా జగన్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కోసం తాను ఎంతో కష్టపడ్డాను ఎన్నో అవమానాలను కూడా ఎదుర్కొన్నాను అలాంటిది ఇప్పుడు నగరి నియోజకవర్గ బాధ్యతలను ఇతరులకు అప్పగించడం న్యాయం కాదని ఆమె జగన్ తీరును విమర్శించినట్టు తెలుస్తుంది. అయితే రోజాకు ప్రత్యామ్నాయంగా అవకాశాలు ఇచ్చి.. గాలి జగదీష్ కు నగిరి బాధ్యతలు అప్పగించాలని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. ఒకటి రెండు రోజుల్లో గాలి తనయుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమని తెలుస్తోంది.