ఏపీ సీఎం వైఎస్ జగన్ కేంద్రంతో దోస్తీ చేస్తున్నారు. ఆయన ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కేంద్రంతో మంచిగానే ఉంటున్నారు. కేంద్రం కూడా జగన్ తో మర్యాదపూర్వకంగానే ఉంటోంది. ఇటీవల లోక్ సభ, రాజ్యసభలో వ్యవసాయ బిల్లులకు వైసీపీ ఎంపీలు పూర్తి మద్దతు ప్రకటించారు. కేంద్రం తీసుకొచ్చే అన్ని బిల్లులకు వైసీపీ మద్దతు తెలుపుతోంది. కేంద్రంతో మంచి సంబంధాలే నెరుపుతున్నారు జగన్.
ఈ నేపథ్యంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ ను ఓ కేంద్ర మంత్రి తెగ పొగిడేశారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. డైనమిక్ సీఎం అంటూ ప్రశంసించారు. వినూత్న ఆలోచనలతో ఆంధ్ర ప్రదేశ్ ను ముందుకు తీసుకెళ్లే సమర్థత జగన్ ఉందంటూ కొనియాడారు. ఇంతకీ ఆ కేంద్ర మంత్రి ఎవరో తెలుసా? కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్ కే సింగ్.
విద్యుత్ రంగంలో ఎన్నో సంస్కరణలు చేపట్టి.. ప్రజలకు భారం కాకుండా విద్యుత్ రంగాన్ని కాపాడాలనే ఆలోచన ఎంతో ఉన్నతమైందని ఆర్కే సింగ్ తెలిపారు. సరికొత్త అడుగులు వేస్తున్న ఏపీకి కేంద్రం కూడా అన్ని విధాలుగా తోడుంటుందని ఆయన హామీ ఇచ్చారు.
నగదు బదిలీకి సంబంధించి… నగదు బదిలీ అమలులో ఏపీ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందన్నారు. ఇటువంటి డైనమిక్ సీఎం ప్రతి రాష్ట్రానికి ఉండాలని… సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటున్న వైఎస్ జగన్ అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. రైతులకు మేలు చేసే ఆలోచన చేయడం కూడా గొప్ప విషయం అని కొనియాడారు. అలాగే ఏపీని కేంద్రం అన్ని విధాలుగా ఆదుకుంటుందని… ఏపీలో రైతుల కోసమే ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్న 10 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు కూడా కేంద్రం చేయూతనిస్తుందన్నారు.