RGV: సినిమాలు రిలీజ్ కాకుండా ఆగిపోయిన వాటిని కూడా తాను సెటిల్‌మెంట్ చేశానని, వాటిల్లో పెద్ద సినిమాలు చాలా ఉన్నాయని నిర్మాత సి. కల్యాణ్ అన్నారు. అందులో భాగంగానే సమరసింహారెడ్డి, బ్రహ్మనాయుడు, చిరంజీవి గారి అంజి సినిమా పంచాయతీ కూడా తానే సెటిల్ చేశానని ఆయన చెప్పారు. దాని కోసం అవతలి వాళ్లని కన్విన్స్ చేయగలగాలని, అలా తాము చేసి నిరూపించామని ఆయన అన్నారు. ఇప్పుడు కొందరు దొంగ దార్లు వెతుక్కుంటున్నారని, తాము మాత్రం అలా చేయలేదని అందర్నీ ఒప్పించి సినిమాని విడుదల చేయించే వాళ్లం అని కల్యాణ్ చెప్పారు. తన కారు కనబడిందంటే చాలు వాళ్ల సినిమాలు ఇక ఏ ఇబ్బందులూ లేకుండా విడుదల అవుతుందని నమ్మిన ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ కూడా ఉన్నారని ఆయన వివరించారు.
ఇదిలా ఉండగా రామ్ గోపాల్ వర్మతో ఒకప్పుడు పెగ్గు సిట్టింగ్ పెట్టేవాడినని, ఈ మధ్య అలాంటివేం లేదని నిర్మాత కళ్యాణ్ అన్నారు. పెగ్గు సిట్టింగ్ పెడితో ఇంకో సినిమా తీయాల్సి వస్తుందేమోనని ఆగిపోయానని ఆయన నవ్వుతూ చెప్పారు. ఆయనతో చాలా టైంపాస్ అవుతుందని, సరదాగా సాగిపోతుందని కల్యాణ్ అన్నారు.
ఇకపోతే ఆర్జీవీ తాగక ముందు, తాగిన తర్వాత, మరుసటి రోజు పొద్దున కూడా ఆయన ఒకేలా ఉంటారని కల్యాణ్ చెప్పారు. కానీ ఆయన గురించి ఒక్క మాటలో చెప్పాలంటే రామ్ గోపాల్ వర్మ చాలా గ్రేట్ పర్సన్ అని, ఒక క్రియేటర్ అని ఆర్జీవీపై ప్రశంసల వర్షం కురిపించారు నిర్మాత కల్యాణ్. కాకపోతే ప్రస్తుతం కొంచెం ట్రాక్ తప్పాడని ఆయన చెప్పారు. ఇప్పటికి కూడా ఆయన నిద్ర లేస్తే ఆ వోడ్కా టైం వోడ్కాటైమే గానీ, ఆ సమయంలో కూడా సినిమా గురించే ఆలోచిస్తాడని ఆయన తెలిపారు. కేవలం సినిమా గురించే మాట్లాడుతాడు తప్ప, పక్క వ్యక్తి గురించి గానీ, ఇంకెవరి గురించో గానీ, అనవసరమైన టాపిక్స్ గురించి ఆయన చర్చించడని కల్యాణ్ స్పష్టం చేశారు. ఆయన 24గంటలూ సినిమా గురించే మాట్లాడుతాడు, ఆలోచిస్తాడు కాబట్టి తనకు ఆయనంటే చాలా ఇష్టం అని కల్యాణ్ చెప్పారు.