రోనా వైరస్ కాదు.. అంతకన్నా ప్రమాదకరమైనది ప్రస్తుత పరిస్థితుల్లో జన సమూహమే. కొందరు వ్యక్తులు చూపే అత్యుత్సాహమో, నిర్లక్ష్యమో.. కారణమేదైతేనేం, పెద్దమొత్తంలో జనం సమూహంగా ఏర్పడి.. కరోనా వైరస్ వ్యాప్తికి కారణమవుతున్నారు.
కరోనా మొదటి వేవ్ సమయంలో ఓ మతానికి చెందిన కార్యక్రమంలో ఇలా పెద్దయెత్తున జనం పాల్గొనడం, అక్కడినుంచి దేశంలోని వేర్వేరు ప్రాంతాలకు వాళ్ళంతా వెళ్ళి కరోనా వ్యాప్తికి కారణమయ్యారు.
రెండో వేవ్ రావడానికి ముందు, మరో మతానికి సంబంధించిన ఓ కార్యక్రమం కోసం జనం పెద్దయెత్తున వెళ్ళి.. అక్కడ కరోనా అంటించుకుని.. దేశంలోని వివిధ ప్రాంతాలకు దాన్ని తీసుకెళ్ళారు. వీళ్ళని ఏమనాలి.? కరోనా క్యారియర్లనాలా.? ఇంకేదైనా తీవ్రమైన పదం వీరి విషయంలో వాడాలా.? ఏమో, ఏమీ అనలేని పరిస్థితి. రెండో వేవ్ నెమ్మదిస్తోంది.
మూడో వేవ్ పొంచి వుంది. కానీ, సెకెండ్ వేవ్ తర్వాత కరోనా నిబంధనల నుంచి కాస్త వెసులుబాటు దొరకగానే, జనం మళ్ళీ పర్యాటక ప్రాంతాలకు పోటెత్తుతున్నారు. మత పరమైన కార్యక్రమాల్లోనూ జోరు చూపిస్తున్నారు. ఇలా అనవసరమైన ‘ట్రావెల్’ చేసేవారికి సంబంధించి ‘రివెంజ్ ట్రావెల్’ అన్న పేరు తెరపైకొచ్చింది.
ఆగస్ట్ చివరి నాటికి లేదంటే, సెప్టెంబర్ మొదటి వారంలో మూడో వేవ్ విజృంభణ ప్రారంభం కావొచ్చని పలు అధ్యయనాలు హెచ్చరిస్తున్న విషయం విదితమే. కరోనా మొదటి వేవ్, రెండో వేవ్ సమయాలో.. దేశం చాలామంది వైద్యుల్ని కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో మూడో వేవ్ వస్తే.. దాన్ని తట్టుకోవడానికి వైద్య రంగం సిద్ధంగా వుందా.? అన్నదానిపై ఐఎమ్ఎ ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. కానీ, జనానికి అవేమీ అనవసరం.
జస్ట్ ఎంజాయ్‌మెంట్ కావాలంతే. కరోనా మొదటి వేవ్, రెండో వేవ్ సందర్భంగా తమవారిని కోల్పోయినవారూ ఈ రివెంజ్ ట్రావెల్ విషయంలో వెనక్కి తగ్గకపోవడం గమనార్హం. దీన్ని దేశంపైకి దండెత్తడం లాంటి వ్యవహారంగానే చూడాలేమో. ఎందుకంటే, కొందరు చేసే తప్పు.. దేశాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తోంది మరి.