పీసీసీ అధ్యక్ష పదవి కోసం ఎన్నో ఏళ్ళుగా ఎదురుచూస్తున్నారు మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కోమటి రెడ్డి వెంకటరెడ్డి. అయితే, టీడీపీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన రేవంత్ రెడ్డి.. చాలా తక్కువ కాలంలోనే పార్టీలో కీలక నేతగా ఎదిగి, పీసీసీ అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్నారు.
దాంతో, కోమటిరెడ్డి వెంకటరెడ్డికి రాజకీయంగా పెద్ద ఎదురు దెబ్బ తగిలినట్లే భావించాలేమో. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఆయన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. చాలాకాలంగా కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకుని వున్నారు. ఇన్నాళ్ళూ పార్టీకి ‘బలంగా’ వున్న కోమటిరెడ్డి సోదరులు, ఇకపై కాంగ్రెస్ పార్టీని నమ్ముకోవడం దండగనే అభిప్రాయానికి వచ్చేసినట్లే కనిపిస్తోంది. నిజానికి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో చాలాకాలంగా అధిష్టానాన్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నారనే ఆరోపణలున్నాయి.
బీజేపీతో పలు మార్లు రాజగోపాల్ రెడ్డి మంతనాలు జరపడం, కోమటిరెడ్డి వెంకటరెడ్డికి పెద్ద మైనస్ అయ్యిందనే చర్చ జరుగుతోంది. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో ఐటీ మంత్రిగా పనిచేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అప్పట్లో తెలంగాణ సెగ గట్టిగానే ఎదుర్కొన్నారు. అప్పట్లోనే తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి ఆయనకు ఆహ్వానం లభించినా వెళ్ళలేదు. ఆ తర్వాత కూడా పలు సందర్భాల్లో కోమటిరెడ్డిని టీఆర్ఎస్ ఆహ్వానించింది. అప్పుడూ ఆయన పీసీసీ చీఫ్ పదవిపై ఆశపెట్టుకునే టీఆర్ఎస్ వైపు చూడలేదు. ఇన్నాళ్ళు ఎదురు చూసినా, కాంగ్రెస్ తనను మోసం చేిసందనే అభిప్రాయంతో వున్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి.
పీసీసీ అధ్యక్ష పదవిని కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డికి అమ్మేసుకుందన్నట్లుగా కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. కోమటిరెడ్డిపై వేటు పడుతుందనే చర్చ కాంగ్రెస్ పార్టీలోని ఓ వర్గంలో జరుగుతుండగా, ఆయన్ని బుజ్జగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని మరో వర్గం అంటోంది. ప్రస్తుతం వున్న పరిస్థితిని బట్టి చూస్తే, కాంగ్రెస్ పార్టీకి ఓ డజను మంది ముఖ్య నేతలు రాజీనామా చేసే అవకాశం వుందట.. అదీ రేవంత్ రెడ్డి దెబ్బ అంటే.