తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి.. కేసీఆర్, అతని పార్టీ టీఆర్ఎస్ పై సాగిస్తున్న ఒంటరి పోరుని ఎన్నో ఏళ్లుగా గమనిస్తూనే ఉన్నాం. ఇతర కాంగ్రెస్ పార్టీ నేతల నుండి సరైన సహకారం కరువైన సమయంలో రేవంత్ రెడ్డి ఏనాడూ మడమ తిప్పలేదు… వచ్చిన అవకాశాన్ని వదులుకోలేదు. అయితే టిఆర్ఎస్ పార్టీ ఎంతో చాకచక్యంగా విపక్షాల లోపాలను ఎండగడుతూ తమ లోపాలను కప్పిపుచ్చుకుంటూ దర్జాగా రాజకీయం సాగిస్తున్న దశలో రేవంత్ రెడ్డి ఆ పార్టీ అధినేతను ఇబ్బంది పెట్టిన సందర్భాలు లెక్కకు మిక్కిలి.
అలాంటి ఒక సంఘటనే ఎలక్షన్ ఫండింగ్ విషయంలో రేవంత్ రెడ్డి గతంలో లేవనెత్తడంతో అది అప్పుడు పెద్ద దుమారం లేపింది. ఇప్పుడు దానికి సంబంధించిన సమాచారం పార్లమెంట్లో బయటకు రావడంతో ఒక్కసారిగా రేవంత్ రెడ్డి చేతికి కెసిఆర్ చిక్కినట్లు అయింది. వివరాల్లోకి వెళితే…. ప్రతి రాజకీయ పార్టీ ఎలక్షన్ సమయంలో ఫండింగ్ చేపడుతుంది. అయితే నిర్దేశిత మొత్తం కన్నా లేదా అవసరం కన్నా మించి ఎలక్షన్ ఫండింగ్ చేయడం… ఫండింగ్ ఇచ్చిన ఆయా వ్యక్తులకు లేడా సంస్థలకు ప్రభుత్వం తరఫున ఫేవర్లు చేసి పెట్టడం అధికార పార్టీలకు ఎప్పటి నుండో ఉన్న అలవాటు.
అయితే రేవంత్ రెడ్డి మాత్రం టిఆర్ఎస్ బయటకు ఇస్తున్న లెక్కల్లో ఎన్నో పొరపొచ్చలు ఉన్నాయని.. ఫండింగ్ అవుతున్న మొత్తం భారీగా ఉంటుందని.. అందుకు తగ్గ సమాచారాన్ని గతంలో ఎలక్షన్ కమిషన్ కు ఇచ్చి తీవ్రమైన ఆరోపణలను చేశాడు. అయితే ఇన్ని సంవత్సరాల తర్వాత ఎలక్షన్ కమిషన్ దగ్గర నుండి వచ్చిన రిపోర్టులు పార్లమెంట్లో బయటకు వచ్చాయి. అందులో ఉన్నది ఏమిటంటే 2017 సంవత్సరంలో రేవంత్ రెడ్డి తరఫున ఫైల్ అయిన ఆరోపణలు తప్పించి టిఆర్ఎస్ పార్టీ పై ఫండింగ్ విషయంలో ఎలక్షన్ కమిషన్ దగ్గర ఎటువంటి ఆరోపణలే లేవట.
ఈ దెబ్బతో దేశంలోని అధికార, ప్రతిపక్ష పార్టీలు అన్నీ నోర్లు వెళ్ళబెట్టాయి. ఒక సాదా సీదా ప్రాంతీయ పార్టీలకే కనీసం ఇలాంటి విషయాల్లో పది పైన ఆరోపణలు, కేసులు ఉంటాయి. అటువంటిది అంత పెద్ద అధికార పార్టీపై ఏమీ లేవంటే అసలు లోగుట్టు వ్యవహారాలు ఏమేమి జరుగుతున్నాయి అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇక రేవంత్ రెడ్డి కి మాత్రం టిఆర్ఎస్ పార్టీ చేస్తున్న ఘనకార్యాన్ని బయటపెట్టేందుకు మంచి అవకాశం దొరికినట్లయింది అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ఫండింగ్ విషయంలోనే కాకుండా మరే ఇతర విషయాల్లో కూడా గత నాలుగేళ్లుగా టిఆర్ఎస్ పై ఎలక్షన్ కమీషన్ వద్ద అసలే కేసులు గాని ఆరోపణలు లేకపోవడం చాలా పెద్ద విచిత్రం. రేవంత్ రెడ్డి ఈ ఒక్క అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే… అధికార పార్టీ చేసింది అని ఆరోపించబడుతున్న అవినీతిని బట్టబయలు చేయడం పెద్ద కష్టం కాదని అంటున్నాయి రాజకీయ వర్గాలు. మరి తనకు చాలా అరుదుగా దొరికిన ఈ వజ్రాయుధాన్ని కాంగ్రెస్ టాప్ లీడర్ ఎలా ఉపయోగించుకుంటాడో వేచిచూడాలి.