తెలంగాణలో ప్రస్తుతం రాజకీయాలన్నీ సరికొత్త రూపును సంతరించుకున్నాయి. చాలెంజ్ ల రాజకీయం నడుస్తోంది. అసెంబ్లీలో మొదలైన డబుల్ బెడ్ రూం ఇళ్ల వాగ్వాదం ఎక్కడికో వెళ్లిపోయింది. నగరంలో లక్ష ఇళ్లు కట్టించామని గొప్పలు చెప్పడం కాదు.. దమ్ముంటే మాకు చూపించండి.. అని కాంగ్రెస్ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క టీఆర్ఎస్ పార్టీకి సవాలు విసరడంతో రాజకీయాలు కాస్త రంగును పులుముకున్నాయి.
అయితే… భట్టి విక్రమార్క విసిరిన సవాళ్లను టీఆర్ఎస్ పార్టీ స్వీకరించింది. స్వీకరించడమే కాదు.. వెంటనే మంత్రి తలసాని… భట్టి ఇంటికి వెళ్లి మరీ.. ఆయన్ను తన కారులో తీసుకెళ్లి నగరంలో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్లను చూపించారు.
సరే.. ఆ టాపిక్ ను కాసేపు పక్కన పెడితే.. భట్టి సవాల్ ను స్వీకరించిన టీఆర్ఎస్ నేతలు.. ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి సవాళ్లను ఎందుకు స్వీకరించరు. అదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోతోంది.
స్వతహాగా రేవంత్ రెడ్డి కాస్త దూకుడు స్వభావం ఉన్న వ్యక్తి. ఆయన ఎవరినైనా సరే ఇట్టే విమర్శించగలడు. టీఆర్ఎస్ పార్టీ నాయకులపై, తెలంగాణ ప్రభుత్వంపై ఆయన చేయని విమర్శ లేదు. విసరని చాలెంజ్ లేదు.
ఎన్నో సార్లు బహిరంగంగానూ టీఆర్ఎస్ నేతలకు చాలెంజ్ విసిరారు. మరి.. ఆ చాలెంజ్ లకు టీఆర్ఎస్ ఎందుకు స్పందించలేదు అనేదే ప్రస్తుతం చర్చనీయాంశమైంది. భట్టీ చాలెంజ్ కు వెంటనే ఒప్పేసుకున్న టీఆర్ఎస్ నేతలు.. రేవంత్ అనే సరికి ఎందుకు వెనక్కి వెళ్తున్నారు.. అనేదే పెద్ద డౌట్.
భట్టి చాలెంజ్ కు స్పందించి వెంటనే ఆయనకు డబుల్ బెడ్ రూం ఇళ్లు చూపించారు.. అలాగే రేవంత్ సవాళ్లకు కూడా స్పందించవచ్చు కదా.. అప్పుడు అసలు నిజాలు బయటపడతాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఒకవేళ రేవంత్ సవాళ్లకు కూడా టీఆర్ఎస్ నేతలు స్పందిస్తారా? అలాంటి చాన్స్ ఏదైనా ఉందా? అనేది త్వరలో తెలుస్తుంది. నిజానికి రేవంత్ విసిరే సవాళ్లకు టీఆర్ఎస్ వెంటనే స్పందిస్తే.. రేవంత్ దే కాదు.. కాంగ్రెస్ నోరు కూడా మూయించవచ్చు. ఆ పని చేస్తే టీఆర్ఎస్ పార్టీకే లాభం. కానీ.. ఎందుకు టీఆర్ఎస్ నేతలు రేవంత్ సవాళ్లకు స్పందించడం లేదు.. అనేదే ప్రస్తుతం సస్పెన్స్.