ఏపీ సీఎం వైఎస్ జగన్ అమిత్ షాను కలవడం సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. రాష్ట్ర ప్రయోజనాల కోసమే సీఎం జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లారని, జగన్ ఢిల్లీ పర్యటనలో రాజకీయ ప్రాధాన్యం లేదని, హోదా, పోలవరం, ప్రత్యేక నిధులపై మాట్లాడారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అంటున్నారు. కానీ రాజకీయ పార్టీలు, విశ్లేషకులు మాత్రం ఈ పర్యటన వెనుక వేరే విషయాలు కూడ ఉన్నాయని వాదిస్తున్నారు. వాటిలో ఆసక్తికరంగా వినిపిస్తున్న అంశం రాష్ట్ర బీజేపీ శాఖ. ఆంధ్రాలో ఆలయాల మీద దాడులు జరుగుతున్నాయని, దీని వెనుక ప్రభుత్వం, ప్రతిపక్షం కుట్ర ఉందని, పర మతాన్ని ప్రోత్సహిస్తూ హిందూత్వాన్ని కూల్చే ప్రయత్నంలో పాలకులు ఉన్నారని బీజేపీ ఆరోపిస్తోంది.
ఈ విషయాన్ని పూర్తిగా వాడేసుకుని ఎడాపెడా ప్రయోజనాలు పొందాలనుకున్న బీజేపీ రథయాత్రను తెరపైకి తీసుకొచ్చింది. తిరుపతిలోని కపిల తీర్ధం నుంచి విజయనగరం జిల్లా రామతీర్ధం వరకూ యాత్ర చేయాలని సోము వీర్రాజు నిర్ణయించారు. యాత్రను తిరుపతి నుండే ఆరంభించాలని అనుకోవడం, వెనుక పెద్ద రీజన్ ఉంది. త్వరలో తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలు రానున్నాయి. ఈ ఎన్నికల్లో పార్టీని ప్రజలకు దగ్గర చేయడానికి రథయాత్రతో హడావుడి చేయాలని చూస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ బలపడాలన్నా, ప్రజల దృష్టిలో పడాలన్నా ఏదైనా పెద్ద కార్యక్రమం చేయాల్సి ఉంటుంది. అందుకే ఈ రథయాత్ర. ఇది అధికార పక్షానికి ఒకింత నష్టం కలిగించే విషయమే.
అందుకే వైకాపా నేతలు ఏం కొంపలు మునిగామని ఈ రథయాత్ర, ఎప్పుడూ చేయని యాత్ర ఇప్పుడే ఎందుకు. అసలు అంతర్వేది రథం దగ్ధం కేసును సీబీఐ ఏం చేసిందో కేంద్రం సమాధానం చెప్పాలి అంటూ యాత్రకు ససేమిరా అంటున్నారు. అయితే సీఎం వైఎస్ జగన్ మాత్రం ఈ ఇష్యు మీద స్పందించలేదు. కానీ బీజేపీ వ్యవహారం ఆయనకు తలనొప్పిగానే ఉంది. కేంద్ర స్థాయిలో సహకరిస్తున్నా రాష్ట్రంలో ఈ గొడవేమిటని అనుకునే ఉంటారు. అలాగని టీడీపీని, జనసేనను చేసినట్టు అణగదొక్కలేరు. అందుకే ఢిల్లీ పర్యటనలో బీజేపీ పెద్దల ముందు ఈ అంశాన్ని జగన్ ఉంచారని, తన అభిప్రాయం చెప్పి అనుమతులు ఇవ్వాలా వద్దా అని సలహా అడిగారని, అక్కడ ఏం చెబితే ఇక్కడ అదే జరుగుతుందని కొందరు అంటున్నారు. మరి ఢిల్లీ పర్యటన గురించి ఈ ప్రస్తావన వచ్చినప్పుడు జగన్ ఏమంటారో చూడాలి.