ఏపీలో ప్రభుత్వం మీద విపరీత విమర్శలతో వార్తలు ప్రచురించే పత్రిక ఏదైనా ఉంది అంటే అది ‘ఆంధ్రజ్యోతి‘నే. ప్రభుత్వం గురించిన ప్రతి కథనంలో, విశ్లేషణలో చివరికి సీఎం తీసుకున్న ఫలానా నిర్ణయం తప్పు అనే జడ్జిమెంట్ ఇస్తుంటారు. మరీ ముఖ్యంగా ఆర్కే ప్రత్యేకంగా రాసే కొత్త పలుకులు అనే శీర్షికలో అయితే వైసీపీని, జగన్ పాలనను ఎండగట్టడమే ఆర్కే ప్రధాన లక్ష్యం. అలాగే తెలుగుదేశం పార్టీని, చంద్రబాబును అనునిత్యం పొగుడుతూ, పైకి లేపుతూ ఉండటం కూడా సదరు పత్రిక యొక్క ప్రధాన లక్ష్యాల్లో ఒకటి. ఒకరకంగా చెప్పాలంటే ఆర్కే ఒక పేపర్, చానల్ చేతిలో పెట్టుకుని ప్రభుత్వం మీద యుద్దమే చేస్తున్నారు. వైఎస్ జగన్ సీఎం హోదాలో తీసుకున్న అన్ని నిర్ణయాలు తప్పని చెప్పడానికి లేదు. కొన్ని నిజంగా ప్రజాప్రయోజన నిర్ణయాలు, పథకాలు ఉన్నాయి. కానీ జ్యోతి పత్రిక మాత్రం ప్రతి నిర్ణయాన్ని తప్పుబట్టేసి భూతద్దంలో చూపే ప్రయత్నం చేస్తుంది.
ఎంత వ్యతిరేకత ఉన్నా ఏదో ఒక దశలో తగ్గుతుంటాయి పత్రికలు. ఉదాహరణకు ‘ఈనాడు’. ఈ పేపర్ కూడ టీడీపీకి అనుకూలమనే పేరు పడిన పత్రిక. అలా అని 24 గంటలు ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి మీద బురద చల్లుతూ ఉండదు. నిజంగా సీఎం చర్యలను, అధికార పార్టీ నేతల పనుతరును మెచ్చుకోవాల్సి వచ్చినప్పుడు మెచ్చుకుంటుంది. కానీ ఆర్కే పత్రిక అలా కాదే.. జగన్ ప్రభుత్వాన్ని రచ్చకు నిలాబెట్టడమే ప్రథమ కర్తవ్యంగా పనిచేస్తుంటుంది. ఇక వారి ఛానెల్ అయితే చెప్పాల్సిన పనిలేదు. ప్రభుత్వం తీసుకున్న ఇంగ్లీష్ మాధ్యమం, 3 రాజధానులు, పేదల ఇళ్ల పట్టాల పంపిణీ ఇలా ప్రతి చర్యలోనూ లోపాలు వెతుకుతుంటుంది. సంక్షేమ పథకాలను సైతం విమర్శిస్తుంది. ఎక్కడ ఏ తప్పు జరిగినా దానికి కర్త, కర్మ, క్రియ అన్నీ జగనే అనే కలరింగ్ ఇస్తుంటుంది.
డబ్బే ఆర్కే కోపానికి కారణం:
అధికార పార్టీ మీద ఎంత వ్యతిరేకత ఉన్నా, టీడీపీ వైపున వకాల్తా పుచ్చుకున్నా సొంత కారణాలు లేనిదే ఆ స్థాయిలో ఎండగట్టం అసాధ్యం. ఆర్కే కోపం వెనుక కూడా అలాంటి కారణమే ఉంది. అదే డబ్బు. చంద్రబాబు హయాం నడిచినన్ని రోజులు ప్రభుత్వం నుండి అందే ప్రయోజనాల కోసం వైసీపీ మీద దాడి చేసిన ఆర్కే మీడియా ప్రభుత్వం మారాక ప్రభుత్వం నుండి రావాల్సిన ప్రోత్సాహకాలు రానందువల్లనే జగన్ మీద విరుచుకుపడుతోంది. ఇంతకీ ఆ ప్రయోజనాలు, ప్రోత్సాహకాలు ఏమిటీ అంటే బిజినెస్. ఉపమానంలో చెప్పాలంటే డబ్బు. టీడీపీ సర్కార్ ఉన్నన్ని రోజుకు ఆంధ్రజ్యోతికి అందిన బెనిఫిట్స్ అన్నీ ఇన్నీ కావు. ప్రభుత్వం తన ప్రకటనల కోసం పత్రికలకు భారీ మొత్తంలో నిధులు కేటాయిస్తుంటుంది. ప్రముఖ పత్రికలకు, ఛానెళ్ళకు అందులో భాగస్వామ్యం ఉంటుంది. ఎవరి సర్క్యులేషన్, ఛానెల్ టిఆర్పీలను బట్టి వారికి ప్రకటనలు, పేమెంట్స్ ఉంటుంటాయి.
ఆంధ్రాలో మొదటి మూడు స్థానాల్లో ఉన్న పత్రికలు, ఛానెల్స్ ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి. ప్రభుత్వం ప్రకటనల్లో మొదటి ప్రాధాన్యం ఈ మూడింటికే ఇవ్వాల్సి ఉంటుంది. కానీ చంద్రబాబు సర్కార్ మాత్రం సాక్షిని నిర్లక్ష్యం చేసి ఈనాడు, ఆంధ్రజ్యోతిలను ఎక్కువగా ప్రోత్సహించేది. మరీ ముఖ్యంగా ఆర్కే పత్రిక, ఛానెల్ కు సింహ భాగం ప్రకటనలు వెళ్లేవి. ఆ తర్వాత ఈనాడుకు ఎక్కువ భాగం ఉండేది. సాక్షికి మాత్రం ఇవ్వాల్సిన స్థాయిలో యాడ్స్ ఇచ్చేవారు కాదు. ఫలితంగా ఆంధ్రజ్యోతికి అధిక మొత్తంలో లాభాలు ఉండేవి. నిజానికి అందాల్సిన లాభాల కంటే రెట్టింపు లాభాలు ఉండేవి. అందుకే టీడీపీని, చంద్రబాబును జాకీలు పెట్టి మరీ ఆకాశానికెత్తేవారు ఆర్కే. బాబుగారు ఏం చేసినా గొప్పేనని, ఏ మాట్లాడినా రైట్ అని నిర్మొహమాటంగా జనం మీద రుద్దేసేవారు ఆర్కే. సాక్షి ఎలాగూ జగన్ పక్షమే కాబట్టి బాబును వ్యతిరేకిస్తూ ఉండేది. కానీ బాబు రాజ్యం పోయి వైఎస్ జగన్ కుర్చీలో కూర్చున్నాక సీన్ మారిపోయింది. ఆర్కే మీడియా పూర్తిగా విస్మరించబడింది. ప్రకటనలు లేవు, ఆదాయం పూర్తిగా పడిపోయింది.
ఎవరికెంత ముట్టిందంటే:
ఒక వ్యక్తి సమాచార హక్కు చట్టం ద్వారా జగన్ హాయాంలో మీడియా సంస్థలకు ప్రకటనలు ఎలా వెళ్లాయి, ఏయే సంస్థకు ఎంతెంత చెల్లించారో లెక్కలు అడగ్గా సమాచార శాఖ ఇచ్చిన వివరాల్లో మొత్తం ప్రకటనల్లో 51.62 శాతం ప్రకటనలు ‘సాక్షి‘ మీడియాకు వెళ్లాయి. ఈ ప్రకటనల ద్వారా సాక్షి పత్రికకు 50 కోట్లు, ఛానెల్ కు 50 కోట్లు ప్రభుత్వం చెల్లించింది. అంటే అధిక మొత్తం అస్మధీయులకే దక్కాయి. ఇక రెండో స్థానంలో ‘ఈనాడు‘కు 33.33 శాతం ప్రకటనలు వెళ్లాయి. వీటి ద్వారా ఆ సంస్థకు 39.64 కోట్లు ముట్టాయి. ఇక ప్రజాశక్తికి 2.96 శాతం, ఆంధ్రప్రభకు 2.14 శాతం, విశాలాంధ్రకు 1.86 శాతం, వార్తకు 1.34 శాతం, ఆంధ్రభూమికి 0.50 శాతం ప్రకటనలు దక్కగా ‘ఆంధ్రజ్యోతి‘కి మాత్రం 0.25 శాతం ప్రకటనలు మాత్రమే దక్కాయి. ఇది చాలా చాలా చిన్న మొత్తం. టీడీపీ హాయాంలో కుంభస్థలాన్ని కొట్టినట్టు కోట్లకు కోట్లు దక్కించుకున్న ఆర్కే గత సంవత్సర కాలంగా ఫీడింగ్ లేక ఎండిపోయారు. అందరికీ పోను మిగిలిన అడుగు బొడుగు మాత్రమే దక్కుతుండటంతో తీవ్ర ఆగ్రహానికి, ఆవేదనకు గురవుతున్నారు. అందుకే జగన్ ప్రభుత్వం మీద గతంలో కంటే రెట్టింపు స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఎంత చేసినా, ఎంత రాసినా జగన్ సర్కార్ ఉన్నన్ని రోజులూ ఆర్కే ఛానెల్, పత్రికకు ఇచ్చే ట్రీట్మెంట్ మారదు.