వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్టరాజుగారు రోజు రోజుకూ డోస్ పెంచుతున్నారు. మొదట్లో నాకు జగన్ మీద ప్రేమ ఉంది, ఆయన బాగు కోసమే నా ఆరాటమంతా అంటూ కబుర్లు చెబుతూ సొంత పార్టీ మీద విమర్శలు చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఆ ప్రేమపూరిత విమర్శలు కాస్త విద్వేషపూరిత సవాళ్లుగా రూపాంతరం చెందినట్టున్నాయి. ఇన్నిరోజులు ప్రభుత్వానికి సలహాలు ఇస్తున్నట్టు కలరింగ్ ఇచ్చిన రాజుగారు ఇప్పుడు ఏకంగా సవాళ్లు విసురుతున్నారు. తాజాగా పార్లమెంట్లో అమరావతి భూముల కుంభకోణంలో సీబీఐ విచారణ డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు వైసీపీ ఎంపీలు. దీన్ని కూడ తప్పుబట్టిన రఘురామకృష్ణరాజు తాను ఆకు రౌడీల బెదిరింపులకు భయపడబోనని అసలు టాపిక్ తీసుకొచ్చారు.
తనను సొంత పార్టీ వ్యక్తులే బెదిరిస్తున్నారని రఘురామరాజు కొప్పడటంలో తప్పు లేదు కానీ ఏకంగా ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఆయన సవాళ్లు చేయడమే ఆశ్చర్యకరంగా ఉంది. తాను ఎవ్వరికీ భయపడే స్థితిలో లేనన్న రెబల్ ఎంపీ అనుకుంటే పులివెందులలో 10,000 మంది జనంతో బహిరంగ సమావేశం పెట్టగలనని కానీ కరోనా కారణంగా ఆగవలసి వస్తోందని అన్నారు. అయినా రాజుగారు తన సాహసం చూపించడానికి పులివెందులలోనే మీటింగ్ పెట్టనవసారం లేదు. తన సొంత నియోజకవర్గం నరసాపురంలో గట్టిగా రెండు రోజులు పర్యటిస్తే చాలు. ఈయన సవాళ్లు వింటున్న చాలామంది ఇదే అంటున్నారు.
కరోనా భయమో, ఇంకొకటో తెలీదు కానీ రఘురామరాజు చాలా రోజులుగా ఢిల్లీకే పరిమితమయ్యారు. అక్కడి నుండే ప్రెస్ మీట్లు పెడుతూ అవాకులు చవాకులు పేలుతున్నారు. మొదట్లో తాను నరసాపురం వెళ్లడానికి భద్రత కావాలని కేంద్రం నుండి భద్రతా సిబ్బందిని రప్పించుకున్నారు. సెక్యూరిటీతో ఫొటోలు దిగి బయటకు వదిలారు. అది చూసి ఇక నరసాపురంలో రాజుగారు మకాం పెడతారని అనుకుంటే అదేం జరగలేదు. ఆ తర్వాత అమరావతి రైతుల వద్దకు పరామర్శకు వెళ్తానని అన్నారు. కానీ అదీ చేయలేదు. ముందుగా ఈ రెండు పర్యటనలు పూర్తి చేసి ఆ తర్వాత పులివెందులకు వెళ్లాలని జనం సైతం సలహా ఇస్తున్నారు.
అనేక రాష్ట్రాల్లో తనకు మిత్రులు ఉన్నారని, పులివెందులలో సైతం తనకు మిత్రులు ఉన్నారని, తన ఒంటి మీద చేయి పడితే కాపాడటానికి చాలామంది వస్తారన్న రాజుగారు పులివెందుల రాజకీయం ఏ తరహాలో ఉంటుందో, అక్కడ జగన్ కుటుంబానికున్న పలుకుబడి ఎలాంటిదో ఊహించలేరని అనుకోవడానికి వీలు లేదు. అయినా ఆయన ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారు అంటే అది కేవలం తన అస్థిత్వాన్ని ప్రకటించుకోవడానికి, వ్యవహారాన్ని పార్టీ నుండి తనను సస్పెండ్ చేసే వరకు తెచ్చుకోవడానికే అన్నట్టు ఉంది.