జనసేనాని పవన్ కళ్యాణ్ వ్యూహాత్మక మౌనం.?

ఎన్నికలు దగ్గర పడుతున్నాయ్.. ఓ వైపు పూర్తి చేయాల్సిన సినిమాలూ పెండింగులో వున్నాయ్. రెండు పడవల మీద ప్రయాణం ఎంత కష్టమో పవన్ కళ్యాణ్‌కి ఈపాటికే అర్థమయి వుండాలి. జనసేనానిగా జనంలో వుండాలి.. సినీ నటుడిగా, కమిట్ అయిన సినిమాలు పూర్తి చేయాలి.. ఇది నిజంగానే చాలా పెద్ద టాస్క్.

‘నా తమ్ముడు నాకంటే దమ్మున్నోడు.. రెండు పడవలపైన ప్రయాణం నేను చేయలేకపోయాను.. కానీ, పవన్ కళ్యాణ్ అలా కాదు.. రెండిటినీ బ్యాలెన్స్ చేయగలడు..’ అంటూ కొన్నాళ్ళ క్రితం మెగాస్టార్ చిరంజీవి చెప్పారు. రాజకీయాల్లోకి వెళ్ళాక చిరంజీవి సినిమాల్ని మానేశారు. సినిమాలు చేయాలనుకున్నాక, రాజకీయాల్ని వదిలేశారు.

పవన్ కళ్యాణ్ మాత్రం రెండు పడవల మీద ప్రయాణం చేస్తున్నారు. దురదృష్టమేంటంటే, రెండిటికీ న్యాయం చేయలేకపోతున్నారాయన. సినిమాల సంగతి పక్కన పెట్టి, రాజకీయాల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, ‘మాకు అవకాశం ఇచ్చి చూడండి..’ అంటూ అడుగుతున్నారు జనసేనాని ఈ మధ్య ‘బలంగా’.!

కానీ, ఆ అడిగేది వారినికోసారి, నెల రోజులకోసారి కాదు. నిత్యం జనంలో వుండి, జనానికి భరోసా ఇచ్చి, ఆ జనం నుంచి భరోసా పొందాల్సి వుంటుంది. రాజకీయాలంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ఎన్నికలు వచ్చేస్తున్నాయ్.. ఏడాదికి పైగా సమయం వుందిలే.. అనుకోవడానికి వీల్లేదు. నిజానికి, అది చాలా తక్కువ సమయం.

అసెంబ్లీ, లోక్ సభ నియోజకవర్గాలకి అభ్యర్థుల్ని ఖరారు చేసుకోవాలి, నియోజకవర్గాల వారీగా ఇన్‌ఛార్జీల నియామకం సహా, గ్రామ స్థాయిలో కమిటీలు.. ఇదంతా చాలా పెద్ద తతంగం. కానీ, పవన్ కళ్యాణ్ వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు. టీడీపీతో పొత్తుకు వెళతాంలే.. అన్న ధీమా వల్లనేనా ఈ మౌనం.? అన్న చర్చ జనసేన వర్గాల్లోనూ షురూ అవుతుండడం జనసేన పార్టీకి అంత మంచిది కాదు.