ఆంధ్రా రాజకీయాల్లో కులం కార్డు ఇప్పటికీ గట్టి ప్రభావం చూపుతుందనేది కాదనలేని వాస్తవం. రాష్ట్రంలో ఉన్న ప్రధాన సామాజిక వర్గాల్లో ఒక్కొక్కటి ఒక్కో పార్టీకి మద్దతుగా ఉంటూ ఉంటారు. సార్వత్రిక, స్థానిక.. ఇలా ఎన్నికలు ఏవైనా, ఆ ఎన్నికల్లో తుది ఫలితాలు ఎలా ఉన్నా ప్రధాన సామాజిక వర్గాలైన కమ్మ, కాపు, రెడ్డి వర్గాల మద్దతు ఏ పార్టీ వైపు ఉందనేది స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే మన నేతలు వారి వారి సొంత సామాజిక వర్గాలకు మాత్రం అధిక ప్రాధాన్యత ఇస్తుంటారు. ఒక వర్గం మద్దతు తెలిపే పార్టీ ఎన్నికల్లో గెలిస్తే మరొక సామాజిక వర్గం పెద్దలు తమపై అధికార పార్టీ కక్ష సాధింపుకు పాల్పడుతోందని ఆరోపణలు కూడా చేస్తుంటారు. ప్రజెంట్ అలా వాపోతున్న సామాజిక వర్గం కమ్మ వర్గం.
కమ్మ సామాజిక వర్గం మొదటి నుండి టీడీపీ, నారా చంద్రబాబు నాయుడుకు మద్దతుగా ఉంటూ వస్తున్నారు. కేవలం ఓట్ల రూపంలోనే కాకుండా కమ్మ వర్గంలోని బడా పారిశ్రామిక వేత్తలు ఆర్థికంగా కూడా సపోర్ట్ ఇస్తూ వచ్చారు. గత ఎన్నికల్లో సైతం వారి ఓట్లు ఎక్కువ శాతం టీడీపీకే పడ్డాయి. అందుకే సీఎం వైఎస్ జగన్ కు ఆ సామాజిక వర్గం అంటే గిట్టదని, అందుకే ప్రభుత్వంలో సైతం వారికి ప్రాధాన్యం ఉండదనే ఆరోపణలు ఉన్నాయి. అలాగే రాజధానిగా ఆమరావతి ఉండకూడదని జగన్ పట్టుబట్టడానికి కారణం కూడ కమ్మ వర్గం మీదున్న కోపమేనని, అక్కడ రాజధాని నిర్మాణం కోసం ఎక్కువగా భూములిచ్చింది కమ్మ జనమేనని అందుకే రాజధానిని అక్కడ ఉంచకూడదని జగన్ భావిస్తున్నట్టు అధికార పార్టీ వర్గాలు, మీడియా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ ఉంది.
కానీ 50 శాతానికి పైగా ఓట్లు అందుకున్న జగన్ ఇలా ఒక కులం మీద కోపం ఎందుకు పెంచుకుంటారు, ఇదంతా ప్రతిపక్షం చేస్తున్న అసత్యపు వాదనని కొందరు అన్నారు. కానీ నిన్న స్వయంగా అధికార పార్టీ ఎంపీ రఘురామరాజు ప్రభుత్వం ఏ కులం మీదైతే కక్ష పెంచుకుందో వారే కాకుండా మిగతా సామాజిక వర్గాలు కూడ రాజధానికి భూములిచ్చాయి అంటూ మాట్లాడిన మాటలు వింటే కమ్మ వర్గం మీద ఆయనకు కోపం అనే మాటలు నిజమేననే సందేహం కలుగక మానదు. ఒకవేళ అదే నిజమైతే రాజధాని భూముల్లో కమ్మ ప్రజలు ఇచ్చిన వాటా 18 శాతం మాత్రమే. రెడ్లు 23 శాతం, ఎస్సీ ఎస్టీలు 32 శాతం, బీసీలు 14 శాతం, కాపులు 9 శాతం, మైనార్టీ, ఇతర వర్గాలు కలిపి 4 శాతం భూములిచ్చారు. కాబట్టి రాజధాని విషయంలో కమ్మల మీద పంతం సాధించాలనుకుంటే మిగతా సామాజిక వర్గాలకు కూడా పెద్ద ఎత్తున నష్టం చేసిన వారవుతారు.