క్రైసిస్‌లో ఒక్కగానొక్క అవకాశం..
2013లో రియల్ స్టార్ శ్రీహరి ఆకస్మిక మరణం అభిమానుల్ని తీవ్రంగా కలచివేసిన సంగతి తెలిసిందే. అప్పటికప్పుడే కమ్ముకొచ్చిన అనారోగ్యం ఆయన్ని అనంతలోకాలకు చేర్చింది. టాలీవుడ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. ఆ సంఘటనను శాంతి శ్రీహరి కానీ ఆయన కుమారులు మేఘాంశ్ – శశాంక్ ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నామని మీడియా ముఖంగా చెబుతుంటారు.
ఇక శ్రీహరి కుమారుడు మేఘాంశ్ `రాజ్ దూత్` అనే సినిమాతో కథానాయకుడిగా పరిచయం అయ్యాడు. జీవిత రాజశేఖర్ సహా సి.కళ్యాణ్ వంటి సినీపెద్దలు శ్రీహరి కుటుంబానికి అండగా నిలిచి మేఘాంశ్ సినిమాని ప్రమోట్ చేశారు. కానీ ఆ సినిమా ఆశించినంత విజయం సాధించలేదు. శ్రీహరి మరణించిన క్రమంలో ఆయన వల్ల లాభపడిన ఎందరో దర్శకులు ఆయన వారసులకు సినీఛాన్సులిస్తామని ముఖం చాటేసారు. ఇప్పటివరకూ మేఘాంశ్ కానీ శశాంక్ కానీ హీరోలుగా టేకాఫ్ కాలేకపోయారు. తాజా పరిస్థితి చూస్తుంటే ఇప్పటికే హీరోగా పరిచయం అయిన మేఘాంశ్ కి సరైన లాంచ్ ప్యాడ్ దొరకలేదనే చెప్పాలి.
కొంతకాలం క్రితం దర్శకరచయిత సతీష్ వేగెశ్న తన కుమారుడు సమీర్ ను హీరోగా లాంచ్ చేస్తూ.. ఇందులో మేఘాంశ్ కి అవకాశం ఇచ్చారు. దివంగత శ్రీ హరి జయంతి సందర్భంగా ఈ చిత్రాన్ని ఈ రోజు ప్రకటించారు. సమీర్ ఒక హీరోగా నటిస్తుండగా.. శ్రీహరి కుమారుడు మేఘాంశ్ శ్రీహరి ఈ చిత్రంలో మరో ప్రధాన పాత్రను పోషించబోతున్నారు.
లక్ష ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎంఎల్‌వి సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. త్వరలోనే సెట్స్ కెళ్లనున్నామని చిత్రబృందం వెల్లడించింది. యంగ్ బోయ్స్ కి తగ్గట్టే యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ఇదని తెలుస్తోంది.
టాలీవుడ్ లో హీరోగా, విలన్ గా, కామెడీ విలన్ గా ,క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణించి, మంచి మనుసున్న వ్యక్తిగా పేరొందిన రియల్ స్టార్ శ్రీహరి నటవారసుల్ని పరిశ్రమ పెద్దలు ఇలా వదిలేయడం సరికాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సురేష్ ప్రొడక్షన్స్ సురేష్ బాబు.. జీఏ2 బ్యానర్ బన్ని వాసు .. యువి క్రియేషన్స్ అధినేతలు.. శ్రీవెంకటేశ్వర బ్యానర్ దిల్ రాజు వంటి పెద్దలు అవకాశాలిచ్చి ఎంకరేజ్ చేస్తారా? అన్నది చూడాలి.