మాస్ మహరాజ్ రవితేజ చేస్తున్న కొత్త చిత్రం ‘ఖిలాడి’. రమేష్ వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. చాలా వరకు షూటింగ్ ముగించుకున్న ఈ సినిమా చివరి దశలో ఉండగా కోవిడ్ కారణంగా నిలిచిపోయింది. రిలీజ్ డేట్ కూడ వాయిదా పడింది. ఇప్పుడప్పుడే థియేటర్లు తెరుచుకుంటాయనే నమ్మకం లేకపోవడంతో చాలా సినిమాలు ఓటీటీ బాట పడుతున్నాయి. అదే కోవలో ‘ఖిలాడి’ కూడ ఓటీటీకి వెళుతుందనే వార్తలు మొదలయ్యాయి. రవితేజ గత చిత్రం ‘క్రాక్’ మంచి హిట్ అయింది. దీంతో ‘ఖిలాడి’కి క్రేజ్ పెరిగింది. బిజినెస్ వర్గాల్లో మంచి డిమాండ్ ఏర్పడింది.
పలు ఓటీటీలు మంచి ధరను ఆఫర్ చేసి సినిమాను కొనుగోలు చేయాలని అనుకున్నాయి. ఆఫర్లతో నిర్మాతలను అప్రోచ్ అయిన మాట కూడ నిజమే. కానీ ‘ఖిలాడి’ని ఓటీటీకి ఇచ్చేది లేదని అన్నారట వారు. అందుకు ప్రధాన కారణం రవితేజనే అని తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమా థియేటర్లలోనే విడుదలకావాలని రవితేజ గట్టిగా డిసైడ్ అయ్యారట. ఇంకా కొంత షూటింగ్ మిగిలి ఉంది. అది మొదలై సినిమా ఫస్ట్ కాపీ రెడీ అయ్యేనాటికి సినిమా హాళ్లు తెరుచుకుంటాయనే నమ్మకంతోనే రవితేజ ఓటీటీకి నో చెబుతున్నారట. బయ్యర్లు సైతం రవితేజ నిర్ణయంతో హ్యాపీగా ఉన్నారట.