AP: ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సరికొత్త మార్పులను చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తిరిగి రేషన్ దుకాణాలను ప్రారంభించడం ఒకటి. 2019 ఎన్నికల ముందు వరకు రేషన్ సరుకుల కోసం ప్రజలు ఇలాగే రేషన్ దుకాణాల వద్దకు వెళ్లి సరుకులు తెచ్చుకునేవారు అయితే ఆ సమయంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పాదయాత్రలో గమనించిన వైఎస్ జగన్ తాను అధికారంలోకి వస్తే ఇంటి వద్దకే రేషన్ సరుకులు పంపిస్తానని మాట ఇచ్చారు.
కిలోమీటర్ల దూరంలో రేషన్ కోసం నడుస్తూ వెళ్లి అక్కడ గంటల తరబడి క్యూ లైన్ వేచి సరుకులు తీసుకువచ్చే పరిస్థితికి చెక్ పెడుతూ జగన్మోహన్ రెడ్డి ఇంటింటికే రేషన్ సరుకులు అంటూ ఒక వాహనాన్ని ప్రత్యేకంగా నియమించారు. ఇలా ఈ వాహనం ఇంటి వద్దకే వచ్చి ప్రజలకు రేషన్ సరుకులను అందించేది. అయితే కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్ సరుకుల పంపిణీలో పాత విధానాన్ని అమలులోకి తీసుకువచ్చింది.. తాజాగా పిఠాపురంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చేతుల మీదుగా రేషన్ దుకాణాలు ప్రారంభం అయ్యాయి.
ఇక ఈ రేషన్ దుకాణాలలో ఒకటో తేదీ నుంచి 15వ తేదీ వరకు రేషన్ సరుకులు పొందవచ్చు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అలాగే సాయంత్రం నాలుగు నుంచి 8:00 వరకు రేషన్ దుకాణాలు తెరుచుకొని ఉంటాయని తద్వారా ప్రజలు వారికి కుదిరినప్పుడు వెళ్లి రేషన్ తెచ్చుకోవచ్చని తెలిపారు. సాంకేతిక లోపాల వల్ల సరుకుల పంపిణీలో అంతరాయం కలిగినప్పటికీ, లబ్ధిదారులను వేచి ఉండకుండా ఫోటో తీసి సరుకులు ఇవ్వాలని అధికార యంత్రాంగం డీలర్లకు స్పష్టమైన సూచనలు చేసింది.
ఇలా ప్రభుత్వం రేషన్ సరుకుల పంపిణీలో సరికొత్త పద్ధతులను అమలు చేస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కంటే ప్రస్తుత విధానం బాగుందని హర్షం వ్యక్తం చేస్తున్నారు.వృద్ధులు, దివ్యాంగులు వంటి ప్రత్యేక అవసరాలున్న లబ్ధిదారులకు ప్రతి నెలా 5వ తేదీ లోపు ఇంటివద్దకే సరుకులు అందజేయనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేశారు. తూకాలలో తేడా వచ్చిన డీలర్ల పై తప్పనిసరిగా చర్యలు తీసుకోబడతాయి అంటూ డీలర్లకు ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది.