రేషన్ డోర్ డెలివరీ.! ఓ ఫెయిల్యూర్ పథకమా.?

నెలలో ఒక్క రోజు రేషన్ దుకాణానికి వెళ్ళి సరుకులు తెచ్చుకోలేనంత దారుణ స్థితుల్లో పేదలు వున్నారా.? అని హైకోర్టు ప్రశ్నించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేషన్ డోర్ డెలివరీ పథకాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా వైఎస్ జగన్ సర్కారు తెరపైకి తెచ్చిన సంగతి తెలిసిందే.

వేలాది వాహనాల్ని ఇందుకోసం వినియోగిస్తున్నారు. ‘మాకు ఆ వాహనాలు వద్దు మొర్రో..’ అంటూ వాటిని తిరిగి ప్రభుత్వానికి ఇచ్చేశారు కొందరు లబ్దిదారులు అప్పట్లో. ఆ వ్యవహారం వివాదాస్పదమవడంతో, కొన్ని వెసులుబాట్లు కల్పించింది వైఎస్ జగన్ సర్కారు, రేషన్ డోర్ డెలివరీ వాహనాలకి.

వాలంటీర్ వ్యవస్థ అయినా, రేషన్ డోర్ డెలివరీ వాహనాలైనా.. ఇవన్నీ జనాల్ని బద్ధకస్తులుగా మార్చేస్తున్నాయన్న విమర్శ వుంది. ముందు ముందు ఇంటి వద్దకే వైద్యం, ఇంటి వద్దకే చదువు.. ఇలా సరికొత్త సంక్షేమ పథకాలు వచ్చేసినా ఆశ్చర్యపోవాల్సిన పని వుండదు.

కోవిడ్ నేపథ్యంలో ఆన్‌లైన్ విద్య.. ఆ దెబ్బకి స్కూళ్ళతో పని లేకుండా పోవడం తెలిసిన విషయాలే. సంక్షేమ పథకాలు ప్రజలకు మేలు చేయాలి తప్ప, ప్రజల్ని బద్దకస్తులుగా మార్చెయ్యకూడదు. మరీ ముఖ్యంగా రేషన్ డోర్ డెలివరీ వాహనాల వ్యవస్థ కారణంగా ప్రజధానం దుర్వినియోగమయ్యిందన్నది నిర్వివాదాంశం.

ఈ విషయాన్నే హైకోర్టు కూడా తన వ్యాఖ్యల ద్వారా పరోక్షంగా పేర్కొన్నట్లయ్యిందనే చర్చ సర్వత్రా జరుగుతోంది. అటవీ ప్రాంతాల్లో, మౌళిక సౌకర్యాలు లేని ప్రాంతాల్లో.. అభివృద్ధి కోసం ఆయా నిధుల్ని వెచ్చిస్తే బావుండేదన్న వాదనా వినిపిస్తోంది.

రోడ్లను నిర్వీర్యం చేసి, వాహనాల పేరుతో పబ్లిసిటీ స్టంట్లు ఎంతవరకు సబబు.? అన్న ప్రశ్న సంగతి సరే సరి.! వాహనదారుకి ఒక్కొక్కరికీ నెలకు 21 వేలు చెల్లించడం, వాహనాలు కొనేందుకు 600 కోట్లు ఖర్చు చేయడం.. వెరసి, రేషన్ డోర్ డెలివరీ వాహనాలతో.. ఖజానాకి కన్నం పడుతోంది తప్ప, ప్రజలకు పైసా ప్రయోజనం లేదన్నమాట.