ఇన్నాళ్లు పవన్‌కు షాకిచ్చిన రాపాక ఇప్పుడు జగన్‌కి ఇచ్చాడు

pawan kalyan
వైసీపీకి ఎంపీ రఘురామరాజు, టీడీపీకి వంశీ, మద్దాలి గిరి, కరణం బలరాం ఎలా రెబల్ అయి తలనొప్పిగా మారారో జనసేనకు కూడా రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ అలాగే ఇబ్బందిగా మారారు.  నిజానికి పైన పేర్కొన్న రెబల్స్ అందరికంటే ముందే రాపాక సొంత పార్టీకి వ్యతిరేక దిశలో ప్రయాణించడం మొదలుపెట్టారు.  జనసేన నుండి గెలిచిన ఒకే ఒక్క ఎమ్మెల్యే కావడంతో పార్టీ గొంతుకను అంసెంబ్లీలో గట్టిగా వినిపిస్తారని పవన్ సహా జనసేన శ్రేణులన్నీ ఆశపడ్డాయి.  కానీ ఎన్నికలు ముగిసిన కొన్ని నెలల్లోనే రాపాక స్వరం మార్చేశారు.  మెల్లగా అధికార పార్టీ మనిషిగా మారిపోయారు.  ఏకంగా పవన్ కళ్యాణ్ అభిప్రాయాలకు, నిర్ణయాలకు వ్యతిరేకంగా జగన్ విధానాలను పొగడటం మొదలుపెట్టారు.  ఇంగ్లీష్ మాధ్యమానికి వ్యతిరేకంగా పవన్ మాట్లాడితే రాపాక మాత్రం జనసేన తరపున సమర్థిస్తున్నట్టు మాట్లాడారు.  
 
ఆ పరిణామంతో పార్టీకి ఆయనకు దూరం పెరిగింది.  ఇక నియోజకవర్గంలో జగన్ ఫొటోలకు పాలాభిషేకాలు లాంటి పనులైతే చెప్పనక్కర్లేదు.  తాజాగా కూడా తాను కేవలం జనసైనికుల ఓట్లతో మాత్రమే గెలవలేదని అంటూ పవన్‌కు పెద్ద షాకిచ్చిన రాపాక పనిలో పనిగా వైఎస్ జగన్‌కి కూడా ఒక ఘలక్ ఇచ్చి పడేశారు.  ముందుగా తనను తాను వైసీపీ మనిషిగా ప్రొజెక్ట్ చేసుకున్న రాపాక వరప్రసాద్ తాను మొదట వైసీపీ టికెట్ కోసమే ట్రై చేశానని కానీ మధ్యలో బొంతు రాజేశ్వరరావు వలన టికెట్ పొందలేకపోయానని ఆ సమయంలో జనసేన ఆఫర్ ఇస్తే ఆ పార్టీ తరపున పోటీకి దిగి గెలిచానని అన్నారు.  ఆయన మాటల్లో తనకు టికెట్ ఇవ్వకుండా బొంతు రాజేశ్వరరావుకు టికెట్ ఇచ్చి జగన్ పొరపాటు నిర్ణయం తీసుకున్నారనే అర్థం ధ్వనిస్తోంది.  
 
ఈ వ్యాఖ్య నిజంగా తనను తక్కువ అంచనా వేశారని జగన్‌కి రాపాక వేసిన చురక అనుకోవచ్చు.  జగన్ టికెట్ ఇచ్చిన బొంతు రాజేశ్వరరావు 2019 ఎన్నికల్లోనే కాదు 2014లో కూడా వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు.  రాపాక చేసిన మరొక వ్యాఖ్య ఏమిటంటే రాజోలులో ఉన్న వైసీపీ వర్గాల్లో తన వర్గం కూడా ఒకటి అనడం.  ఈ మాటలతో బొంతు వర్గంలో అసహనం నెలకొంది.  అసలు జగన్ తనకు టికెట్ ఇచ్చి తప్పు చేశారన్నట్టు రాపాక మాట్లాడటంతో బొంతు హర్ట్ అయ్యారని, ఈ విషయమై సీఎంతో మాట్లాడే యోచనలో ఉన్నారని టాక్.  ఇదే నిజమైతే తాను ఆదరించాలనుకున్న రాపాక వల్లనే జగన్‌కు తలనొప్పి మొదలైనట్టే.