దగ్గుబాటి వెంకటేష్ స్పూర్తితో నటుడిగా ఆరంగేట్రం చేశాడు రానా దగ్గుబాటి. లీడర్ సినిమాతో హీరోగా పరిచయం అయిన రానా ఆ తర్వాత వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకులని పలకరించారు. బాహుబలి సినిమాలో భళ్ళాలదేవుడి పాత్ర రానాకు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిపెట్టింది. భళ్ళాలదేవుడి పాత్ర కోసం రానా ఎంతగా కృషి చేశారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. కఠోర శ్రమ, నిబద్ధతో ఎంతగానో శ్రమించిన రానా తన బాడీ రూపం కూడా పూర్తిగా మార్చేశాడు. హీరోకు ధీటుగా రానా ప్రదర్శించిన నట విశ్వరూపం విమర్శకుల ప్రశంసలు కూడా దక్కేలా చేసింది.
బాహుబలి సినిమా తర్వాత రానా ఆరోగ్యానికి సంబంధించి అనేక వార్తలు వచ్చాయి. కిడ్నీ మార్పిడి చేయించుకోనున్నాడని, ఈ శస్త్ర చికిత్స కోసం విదేశాలకు వెళుతున్నాడని పలు వార్తలు దావానంలా వ్యాపించాయి. అయితే అదే సమయంలో రానా చాలా సన్నగా కనిపించాడు. దీంతో అందరిలో ఆందోళన నెలకొంది. అయితే ఎన్నో కష్టాలను ఎదుర్కొన్న రాని ఇప్పుడు మళ్ళీ పాత రూపం పొందేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నాడు. ట్రైనర్ సమక్షంలో పలు ఎక్సర్‌సైజ్‌లు చేస్తూ కండలు పెంచేందుకు సిద్దమవుతున్నాడు. తాజాగా తన వర్కవుట్‌కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేయగా, అది వైరల్‌గా మారింది.
ప్రస్తుతం రానా విరాట పర్వం, అరణ్య అనే సినిమాలతో ప్రేక్షకులని అలరించేందుకు సిద్ధమయ్యాడు. విరాట పర్వం చిత్రాన్ని ఏప్రిల్ 30న థియేటర్స్‌లోకి తీసుకురాబోతున్నాడు. ఇందులో రానా నక్సలైట్‌గా కనిపించనున్నట్టు తెలుస్తుండగా,ఆయన సరసన సాయి పల్లవి కథానాయికగా నటిస్తుంది. ప్రియమణి ప్రత్యేక పాత్రలో కనిపించి అలరించనుంది. ప్రస్తుతం హిరణ్య కశిప అనే చిత్రంతో పాటు పలు సినిమా షూటింగ్స్‌లో పాల్గొనేందుకు రానా సిద్ధమయ్యాడు.