వ్యాయామం అనగానే మనకు ఆరోగ్యకరమైన జీవనశైలి, బలమైన శరీరం, చురుకైన మనసు గుర్తుకు వస్తాయి. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే గుండె బలపడుతుంది, బరువు నియంత్రణలో ఉంటుంది, శరీరానికి తగినంత శక్తి లభిస్తుంది. అయితే, కొన్ని సందర్భాల్లో జిమ్‌లో వ్యాయామం చేస్తున్నప్పుడే గుండెపోటు వచ్చిన సంఘటనలు మనం వింటుంటాం. ఇది ఆశ్చర్యంగా అనిపించినా, నిపుణుల అభిప్రాయం ప్రకారం దీని వెనుక కొన్ని సాధారణ తప్పులే కారణమని తేలింది.
వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. వ్యాయామం చేస్తున్నప్పుడు ఎక్కువ మంది చేసే రెండు ప్రధాన తప్పులు గుండెపై తీవ్ర ప్రభావం చూపించి, ప్రాణాలను కూడా ప్రమాదంలో పడేస్తాయని వైద్యులు హెచ్చరించారు. అందులో మొదటి తప్పు తగినంత నీరు తాగకపోవడం. వ్యాయామం చేస్తే శరీరం చెమటతో నీటిని మాత్రమే కాదు, ముఖ్యమైన ఖనిజ లవణాలను కూడా కోల్పోతుంది. దీనివల్ల డీహైడ్రేషన్ వస్తుంది, రక్తపోటు పడిపోతుంది. గుండెకు కావలసిన ఆక్సిజన్ సరిపడా చేరకపోవడంతో ఒక్కసారిగా గుండెపై ఒత్తిడి పెరిగి గుండెపోటు వచ్చే అవకాశముంది. నిపుణుల సూచన ప్రకారం, వ్యాయామం చేస్తున్నప్పుడు ప్రతి 15–20 నిమిషాలకు కొద్దిగా నీరు తాగాలి. ఒక్కసారిగా ఎక్కువగా తాగకూడదు. చిన్న చిన్న సిప్స్‌గా తాగడం అలవాటు చేసుకోవాలి.
రెండవ తప్పు బరువైన లేదా బిగుతైన దుస్తులు ధరించడం. కొందరు ఎక్కువ చెమట వస్తే బరువు త్వరగా తగ్గుతుందని భావించి జాకెట్లు లేదా గట్టిగా పట్టే దుస్తులు వేసుకుంటారు. ఇది పూర్తిగా తప్పు. ఇలాంటివి వేసుకుంటే శరీరానికి గాలి సరిగా చేరదు, శరీర ఉష్ణోగ్రత పెరిగి వడదెబ్బ వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇది నేరుగా గుండె పనితీరుపై ఒత్తిడి పెంచి, గుండెపోటుకు దారితీస్తుంది. కాబట్టి వ్యాయామం చేసే సమయంలో తేలికైన, వదులగా ఉండే కాటన్ దుస్తులు ధరించాలి.
నిపుణులు చెబుతున్న మరో ముఖ్యమైన అంశం శరీరాన్ని ఒక్కసారిగా అధిక ఒత్తిడికి గురి చేయకూడదు. చాలా మంది మొదటి రోజే ఎక్కువ బరువులు ఎత్తడం లేదా అధిక శిక్షణ తీసుకోవాలని చూస్తారు. ఇది కండరాలకే కాదు గుండెకు కూడా ప్రమాదకరం. క్రమంగా శరీరాన్ని అలవాటు చేసుకుంటూ వ్యాయామం పెంచుకుంటే సురక్షితం. అలాగే, వ్యాయామం చేయడానికి ముందు వార్మప్, తర్వాత కూల్‌డౌన్ తప్పనిసరిగా చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇవి గుండెపై అకస్మాత్తుగా ఒత్తిడి రాకుండా కాపాడుతాయి. అలాగే ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకోవడం, శరీరానికి తగిన ఆహారం తీసుకోవడం కూడా వ్యాయామంలో భాగమే అని వైద్యులు చెబుతున్నారు.
మొత్తం మీద, వ్యాయామం ఆరోగ్యానికి మేలు చేస్తుంది కానీ జాగ్రత్తలు పాటించకపోతే అది ప్రమాదకరం కూడా అవుతుంది. నీరు తాగడం, సరైన దుస్తులు ధరించడం, శరీరాన్ని హద్దులు దాటేలా ఒత్తిడి చేయకపోవడం వంటి చిన్న చిన్న అలవాట్లు పాటించడం ద్వారా వ్యాయామాన్ని సురక్షితంగా మార్చుకోవచ్చు.
