ద్విభాషా చిత్రాన్ని ప్ర‌క‌టించిన రామ్.. ద‌ర్శ‌కుడు ఎవ‌రో తెలుసా?

యంగ్ అండ్ ఎన‌ర్జిటిక్ హీరో రామ్ సంక్రాంతి కానుక‌గా రెడ్ అనే సినిమాతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా ప్రేక్ష‌కుల‌ని పెద్ద‌గా అల‌రించ‌లేకపోయింది. దీంతో రామ్ త‌దుపరి సినిమాపై అభిమానుల‌లో ఆస‌క్తి పెరిగింది. లింగుస్వామి, త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో రామ్ సినిమా ఉంటుందని కొన్నాళ్లుగా ప్ర‌చారం జ‌రిగిన దీనిపై క్లారిటీ అనేది లేదు. ఇక రామ్ ఇటీవ‌ల సినిమాల‌కు స్మాల్ బ్రేక్ తీసుకుంటాన‌ని చెప్పే స‌రికి రామ్ త‌దుప‌రి సినిమాపై అభిమానుల‌లో సందిగ్ధం నెల‌కొంది. ఈ నేప‌థ్యంలో రామ్ కొద్ది సేప‌టి క్రితం త‌న 19వ సినిమాకు సంబంధించి అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న చేశారు.


ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న క్ష‌ణం వచ్చింది. నా ఫేవరెట్‌ దర్శకుడు లింగు స్వామి సర్‌తో‌ రాపో19 తెలుగు తమిళ భాషల్లో తెరకెక్కుతుంది. శ్రీనివాస చిత్తూరితో పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నాను. అని రామ్ కామెంట్ పెట్టారు. తాజాగా తెర‌కెక్క‌నున్న చిత్రం బైలింగ్యువ‌ల్ మూవీగా రూపొందనుంది. ఎస్.ఎస్. స్క్రీన్స్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన కథానాయిక సహా ఇతర నటీనటులు టెక్నీషియన్ల వివరాల్ని త్వరలోనే వెల్లడించానున్నారు. ‘పందెం కోడి’, ‘ఆవారా’ తదితర డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్ని అల‌రించిన తమిళ దర్శకుడు లింగుస్వామితో రామ్ జ‌త‌క‌ట్ట‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

రామ్ రేంజ్ ప్ర‌స్తుతం పీక్స్‌లో ఉంది. ఇస్మార్ట్ శంక‌ర్ చిత్రం త‌ర్వాత రామ్ సినిమాల‌పై అంత‌టా ఆస‌క్తి పెరిగింది. మాస్ లుక్‌లో మ‌నోడు దుమ్ము రేపడంతో అభిమానులు ఆయ‌న ప్ర‌తి సినిమాపై ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్నారు. లింగుస్వామి చిత్రం త‌ర్వాత రామ్‌.. త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తాడ‌నే చ‌ర్చ మొద‌లైంది. దీనిపై ఎప్పుడు క్లారిటీ ఇస్తాడో చూడాలి మ‌రి. రామ్- లింగుస్వామి చిత్ర షూటింగ్ ఏప్రిల్ నుండి మొద‌లు కానుంది. ప్ర‌స్తుతం రామ్ శివ మాల‌లో ఉన్న విష‌యం తెలిసిందే.