TG: ఒక పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత తమ ప్రభుత్వ పాలన ఎలా ఉన్నా కూడా ఆ పార్టీకి చెందిన నాయకులు తమ ప్రభుత్వం గురించి ఎంతో గొప్పగా చెబుతారు. తమ పాలన అద్భుతంగా ఉంది అని మాట్లాడుతారు కానీ తెలంగాణలో మాత్రం ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఏమాత్రం బాగాలేదు అంటూ సొంత పార్టీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతున్నాయి.
తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి కంటే కూడా కేసీఆర్ పాలనే బాగుందని ఈయన మాట్లాడారు. మునుగోడు నియోజక వర్గంలో MLA కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పథకాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వ తీరు గురించి కాంగ్రెస్ పాలన గురించి గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలు తిడుతున్నారని, కెసిఆర్ ను మెచ్చుకుంటున్నారని తెలిపారు.
రైతు బంధు మధ్యలో ఒకసారి ఎగ్గొట్టినమంటూ బాంబ్ పేల్చారు. రైతు భరోసాలో ఇచ్చిన హామీ మేరకు కాకుండా, కొంత నగదును తగ్గించామంటూ తప్పును ఈయన ఒప్పుకోవడమే కాకుండా మేము చేసిన ఈ తప్పు కారణంగానే మా ప్రభుత్వం పై వ్యతిరేకత వస్తుందని మమ్మల్ని తిడుతున్నారని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తెలిపారు.
ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ఎన్ని అప్పులు చేసి అయినా కూడా అమలు చేస్తామని తెలిపారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలలో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రూపకల్పన తీరు సరిగా లేదంటూ ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేశారు. ఇలా సొంత పార్టీ ఎమ్మెల్యే ప్రభుత్వ పాలన విధానం పై ఇలా అసహనం వ్యక్తం చేయడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. మరి ఎమ్మెల్యే చేసిన ఈ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందన ఏంటి అనేది తెలియాల్సి ఉంది