హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షాలకు వరదలు ఎలా పోటెత్తాయో అందరం చూశాం. దాదాపుగా హైదరాబాద్ మొత్తం వరదల్లో మునిగిపోయింది. ఇళ్లలోకి వరద నీరు చేరడం, రోడ్లన్నీ జలమయం కావడంతో జనాలు తీవ్ర అవస్థలకు గురయ్యారు.
తాజాగా వరదలో చిక్కుకున్న ఓ ఫ్యామిలీని ప్రాణాలకు తెగించి రాజేంద్ర నగర్ పోలీసులు కాపాడారు. ఆ ఫ్యామిలీలో సంవత్సరం బాబు ఉండటంతో అతి కష్టం మీద వాళ్లను కాపాడి ఒడ్డుకు చేర్చారు పోలీసులు. వరద పోటెత్తుతుండగా… అటూ ఇటూ తాడు లాగి.. వెనుక బాబును కట్టేసుకొని పోలీసులు వాళ్లను కాపాడారు.
ఈ ఘటన బండ్లగూడలో చోటు చేసుకున్నది. ఓ ఫ్యామిలీ వరదలో చిక్కుకున్నదని తెలుసుకున్న రాజేంద్ర నగర్ పోలీసులు వెంటనే అక్కడి చేరుకొని వాళ్లను రక్షించారు.
వరద నీరు ఉదృతంగా ప్రవహిస్తుండటంతో వాళ్లను కాపాడగలుగుతామో.. లేదో అని పోలీసులు భయపడిపోయారు. అయినా కూడా ప్రాణాలకు తెగించి పోలీసులు వారిని కాపాడటంతో.. అక్కడి స్థానికులు పోలీసులను ప్రశంసల్లో ముంచెత్తారు.
హిమాయత్ సాగర్ గేట్లు ఓపెన్ చేయడం వల్ల దాని కింద ఉన్న ప్రాంతాల్లోకి ఒక్కసారిగా వరద నీరు పోటెత్తడంతో.. రోడ్లన్నీ వాగులను తలపిస్తున్నాయి.