తెలంగాణ వ్యాప్తంగా విస్తరించిన వానలు.. పలు జిల్లాలకు భారీ వర్షసూచన..!

పది పదిహేను రోజులుగా వేడి, పొడి వాతావరణంతో విలవిలలాడిన తెలంగాణకు ఎట్టకేలకు వర్షం తాకింది. పంటలు ఎండిపోతున్నాయి, నేలలు బద్దలవుతున్నాయి అని ఆందోళనలో ఉన్న రైతులకు సోమవారం మురిసిపోయింది. ఆగస్టు 4న రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారిగా వాతావరణం మారింది. మొదట మోస్తరు వర్షాలతో ప్రారంభమై, క్రమంగా కొన్ని ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురిసాయి. దీంతో రైతులకు ఊరట లభిచింది. మళ్లీ పంటలు బతకగలవనే నమ్మకాన్ని ఇచ్చింది.

ఇక హైదరాబాద్‌లో ఉదయం నుంచే కుండపోత వర్షం కురవడం ప్రారంభమైంది. వాతావరణ శాఖ ముందుగానే తెలిపినట్లుగా వర్షాలు రాష్ట్రం అంతటా విస్తరించాయి. మోస్తరు నుంచి భారీ వర్షాల వరుస తో తెలంగాణ చల్లబడింది. మేఘాలు మారుమూల ప్రాంతాలను తాకుతున్నాయి.. ఆకాశంలో మారిన రంగు రైతుల ముఖాల్లోనూ వెలుగునిచ్చింది.

రంగారెడ్డి, వికారాబాద్, నల్గొండ జిల్లాల్లో ఇప్పటికే వర్షం పడుతుండగా, రాష్ట్రంలోని మరికొన్ని జిల్లాల్లో వానలు ముంచెత్తుతున్నాయి. ఆదిలాబాద్, జగిత్యాల, కామారెడ్డి, కరీంనగర్, మహబూబ్ నగర్, మెదక్, నాగర్ కర్నూల్, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల వంటి జిల్లాల్లో తక్కువ సమయంలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. గాలి వేగం 40 కి.మీ గంట కంటే తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులతో వర్షం వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి.

ఇక మరోవైపు, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, కొమరం భీమ్ ఆసిఫాబాద్, సంగారెడ్డి, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలు కూడా వర్షాల తాకిడికి సిద్ధంగా ఉండొచ్చని అధికారులు హెచ్చరిస్తున్నారు. తదుపరి 2-3 గంటల్లో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. వర్షాలు కురిసినప్పటికీ, ఇది ఆఖరి కదా అన్నట్టు మరోసారి వర్షించకపోతే పరిస్థితి మళ్లీ విషమించవచ్చు. అందుకే వర్ష జలాలను సద్వినియోగం చేసుకోవడం, చెరువులు, పంటపొలాల వద్ద నీరు నిల్వచేయడం ఎంతో అవసరం.

ఇటు వాతావరణ శాఖ సూచనల ప్రకారం, వర్షాలు మరికొన్ని రోజులపాటు కొనసాగే సూచనలు ఉన్నాయి. తక్కువ సమయంలో ఆకాశం మారే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. వర్షం కురిసిందంటే సమస్యలు తీరినట్టే కాదు… కానీ రైతుల మానసికస్థితిలో మాత్రం ఓ కొత్త ఆశజ్యోతి వెలిగింది. మట్టిలో మళ్లీ జీవం పుట్టబోతుందన్న విశ్వాసం మొదలైంది.