Crime News: కామాంధుల దాహానికి బలైన మహిళ.. అన్నం,నీళ్లు లేక ఆరు రోజులపాటు అడవిలో నరకయాతన..!

Crime News:కామాంధుల దాహానికి మరొక మహిళ ప్రాణాలు విడిచింది. ఆరు రోజులు నరకయాతన అనుభవిస్తూ అడవిలో కదలలేని స్థితిలో ఉండి పోయింది. ఆమె మరణ వాంగ్మూలం ఇవ్వడానికే బ్రతికినట్టుగా అనిపిస్తుంది ఈ ఆర్టికల్ చదివితే. కొన ఊపిరితో ఉన్న ఆమె గురువారం సాయంత్రం తుదిశ్వాస విడిచింది.

సంచలనం సృష్టించిన ఈ ఘటన రాజస్థాన్ లోని నాగౌర్ జిల్లా దీద్వన అనే గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… గ్రామానికి చెందిన 35 ఏళ్ల మహిళ ఫిబ్రవరి 4వ తేదీన పని నిమిత్తం బయటకు వెళ్లింది. ఎంతసేపటికి ఆమె ఇంటికి తిరిగి రాకపోవడంతో బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిసిన చోట గాలించారు. రెండు రోజుల తర్వాత పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. ఆమె మిస్ అయిన రెండు రోజులకు స్టేషన్లో మిస్సింగ్ కేస్ ఫైల్ అయింది.

రోజులు గడుస్తున్నా పోలీసులు ఈ కేసు మీద ఎక్కువగా కాన్సంట్రేట్ చేయకుండా ఉన్నారని బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్తులు రాస్తారోకోలు చేశారు. రోడ్డుమీద బైఠాయించారు, దీంతో ఈ విషయం మీడియాను ఆకర్షించింది. పోలీసుల మీద విమర్శలు వెల్లువెత్తడంతో కుటుంబ సభ్యులను విచారించగా వారు అదే గ్రామానికి చెందిన సురేష్ మేగ్వాల్ అనే వ్యక్తి మీద అనుమానం ఉన్నట్టు తెలిపారు. అతన్ని ఫిబ్రవరి 9 న అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. తమ స్టైల్లో విచారణ జరపగా ఆమెను రేప్ చేసి గ్రామానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న అటవీ ప్రాంతంలో పడేసినట్టు తెలిపాడు. ఫిబ్రవరి 10వ తేదీన పోలీసులు ఆ స్పాట్ కి వెళ్లి చూడగా ఆమె దుస్తులు లేకుండా కొన ఊపిరితో సృహ లేకుండా పడి ఉంది.

ఆమెను జైపూర్ ఆస్పత్రికి తరలించారు. ఆమె తెలిపిన వివరాల మేరకు సురేష్ అనే వ్యక్తి ఒక మైనర్ సహాయంతో ఆమెను ఆటోలో కిడ్నాప్ చేసి, దగ్గరలో ఉన్న అడవిలోకి తీసుకెళ్లి రేప్ చేశాడు. ఆపై పక్కనే ఉన్న బండరాయితో ఆమె తలమీద కొట్టారు. ఆమె చనిపోయిందని భావించి పక్కనే ఉన్న ఒక బావి సమీపంలో పడేసి వెళ్లిపోయారు. ఫిబ్రవరి 10వ తేదీ నుండి చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం కన్నుమూసింది అని నాగౌర్ ఎస్పి రామ్మూర్తి జోషి తెలిపారు. నిందితులు ఇద్దరు పోలీసుల అదుపులో ఉన్నారు అని ఆయన తెలిపారు. ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేస్తున్నట్టు ఎస్పీ తెలిపారు.