అత్యాధునిక వైద్య సదుపాయాలు, ఆరోగ్యంపై పెరుగుతున్న అవగాహన ఉన్నప్పటికీ గుండె జబ్బులు అకాల మరణాలకు ప్రధాన కారణంగా మారుతున్నాయి. ఇటీవల గుండెపోటుతో మృతి చెందుతున్నవారి వయస్సు మరింత తగ్గుతుండటం ఆందోళన కలిగిస్తోంది. వృద్ధులకే పరిమితమై ఉన్నదనుకున్న గుండె సమస్యలు, ఇప్పుడిప్పుడే జీవితాన్ని ప్రారంభిస్తున్న చిన్నారులను సైతం ఊహించని రీతిలో బలి తీసుకుంటున్నాయి.
సాధారణంగా గుండెపోటును వైద్య పరిభాషలో మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ అని పిలుస్తారు. ఇది గుండెకు రక్తప్రసరణ తీవ్రంగా తగ్గినప్పుడు లేదా పూర్తిగా ఆగినప్పుడు సంభవిస్తుంది. ఫలితంగా గుండె కండరాలు ఆక్సిజన్ అందక తీరని నష్టం వాటిల్లుతుంది. ఈ పరిస్థితికి ప్రధాన కారణంగా కరోనరీ ధమనుల్లో కొవ్వు పేరుకుపోయి, అవి చిట్లి రక్తం గడ్డకట్టడం వల్ల రక్త ప్రవాహం నిలిచిపోవడం వైద్యులు చెబుతున్నారు.
అమెరికాలోని నార్త్ కరోలినాలో ఉన్న యుఎన్‌సి రెక్స్ హాస్పిటల్ కార్డియాలజీ విభాగాధిపతి డాక్టర్ క్రిస్ కెల్లీ ప్రకారం, గుండెపోటుకు సంబంధించిన సంకేతాలు కొన్ని సందర్భాల్లో స్పష్టంగా ఉండవని, అవి ఇతర ఆరోగ్య సమస్యలతో కలిసిపోతూ కనిపించే అవకాశం ఉందని చెప్పారు. ముఖ్యంగా మహిళల్లో కనిపించే కొన్ని లక్షణాలు అత్యంత అపాయం తలెత్తించగలవని ఆయన హెచ్చరించారు.
గుండెపోటుకు అత్యంత సాధారణ సంకేతంగా ఛాతీలో నొప్పి కనిపిస్తుంది. ఇది కొన్నిసార్లు ఒత్తిడి లేదా బిగుతుగా అనిపించవచ్చు. ఛాతీలో ఈ రకమైన అసౌకర్యం తగ్గకపోతే, అలాగే భుజాలు, చేతులు, దవడ దాకా వ్యాపిస్తే అది చాలా కీలక హెచ్చరిక అని చెబుతున్నారు. ఇలాంటి సమయంలో అశ్రద్ధ వహించకుండా వెంటనే వైద్య సాయం తీసుకోవాలని సూచిస్తున్నారు.
తరచూ ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడటం కూడా మరో ముఖ్య సంకేతమని డాక్టర్ కెల్లీ పేర్కొన్నారు. శరీరశ్రమ లేనప్పటికీ శ్వాస కోసం ప్రయత్నించాల్సిన పరిస్థితి గుండె సరిగా పనిచేయకపోవటానికి సూచన అని తెలిపారు. ఊపిరితిత్తుల్లో ద్రవం పేరుకుపోవడం వల్ల గుండె మీద ఒత్తిడి పెరగవచ్చని చెప్పారు. ఆకస్మికంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగితే వెంటనే అత్యవసర విభాగానికి వెళ్లాలని హెచ్చరించారు.
అదే విధంగా, పొత్తికడుపులో అసహజమైన నొప్పి, వికారం వంటి లక్షణాలు కూడా గుండెపోటుకు సంకేతాలుగా ఉండే అవకాశం ఉంది. చాలామంది ఈ లక్షణాలను అజీర్ణంగా భావించి తప్పుదారి పడుతున్నారని, కానీ ఈ లక్షణాలు గుండె సంబంధిత సమస్యలే అయినట్లయితే ప్రాణాలపై ముప్పుగా మారవచ్చని చెప్పారు. ముఖ్యంగా మహిళల్లో ఇటువంటి లక్షణాలు గుండెపోటుకు సాధారణంగా కనిపిస్తాయని వివరించారు. ఛాతీలో ఒత్తిడి, బరువుగా అనిపించడం, దడ, మైకం, తల తిరుగుడు, తీవ్రమైన ఆందోళన వంటి లక్షణాలున్నా వాటిని లైట్‌గా తీసుకోవద్దని, ఇవన్నీ గుండెపై ప్రమాద సూచకంగా ఉండే అవకాశముందని హెచ్చరించారు.
ఈ సంకేతాలను గమనించి సకాలంలో వైద్యులను సంప్రదించడం ద్వారా ప్రాణాలు రక్షించుకోవచ్చని స్పష్టం చేశారు. ఏ చిన్న అనుమానమైనా నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఎందుకంటే, గుండె ఏ సమయంలో ఎలా స్పందిస్తుందో ఎవరూ ఊహించలేరు. అప్రమత్తతే ఆయుష్షును పొడిగించగలదని నిపుణులు చెబుతున్నారు.
