అసలే కరోనా కాలం. పూర్తిస్థాయిలో రైళ్లు నడవడం లేదు. అందుకేనేమో.. రైల్వే శాఖ ప్రయాణికులకు షాక్ ఇచ్చింది. ఇక నుంచి ప్రయాణికుల నుంచి యూజర్ చార్జీలను వసూలు చేయనున్నట్టు రైల్వే శాఖ ప్రకటించింది. నిజానికి యూజర్ చార్జీలు కేవలం విమానాశ్రయాల్లో మాత్రమే ఉంటాయి.
కానీ.. ఇక నుంచి రైల్వే స్టేషన్లలోనూ ప్రయాణికుల నుంచి యూజర్ చార్జీలను వసూలు చేయడానికి రైల్వే శాఖ సన్నద్ధమవుతోంది. దానికి సంబంధించిన ప్రకటనను రైల్వే శాఖ త్వరలో చేయనుంది.
అయితే.. అన్ని రైల్వే స్టేషన్లలో కాకుండా.. బిజీగా ఉండే రైల్వే స్టేషన్లలో మాత్రమే యూజర్ చార్జీలను వసూలు చేయనున్నారు.
ఎంపిక చేసిన రైల్వే స్టేషన్లలో, ఎక్కువగా బిజీగా ఉండే రైల్వే స్టేషన్లలో అత్యాధునిక సదుపాయాలను కల్పించి.. వాటికి యూజర్ చార్జీలను రైల్వే శాఖ వసూలు చేయనుంది.
భారత్ లోని 7000 స్టేషన్లలో ఈ యూజర్ చార్జీలను రైల్వే శాఖ వసూలు చేయనుంది. అందులోనూ త్వరలోనే ప్రైవేటు సంస్థలు కూడా రైళ్లను నడపడానికి సమాయత్తం అవుతున్న నేపథ్యంలో టికెట్ల ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని రైల్వే బోర్డు చైర్మన్ వీకే యాదవ్ వెల్లడించారు.
దేశంలో ఉన్న ముఖ్యమైన రైల్వే స్టేషన్లను అప్ గ్రేడ్ చేయబోతున్నాం. వాటికే నామమాత్రంగా యూజర్ చార్జీలను వసూలు చేస్తాం. దానికి సంబంధించి యూజర్ చార్జీల నోటిఫికేషన్ త్వరలోనే విడుదలవుతుంది. ఎయిర్ పోర్టుల్లో ఎటువంటి సౌకర్యాలు ఉంటాయో… రైల్వే స్టేషన్లలోనూ అలాంటి సౌకర్యాలే కల్పించేందుకు సమాయత్తం అవుతున్నాం.. అని ఆయన తెలిపారు.